Toxic : కన్నడ నటుడు యష్ ప్రధాన పాత్రలో వచ్చిన 'టాక్సిక్' (Toxic) చిత్రంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి ఎట్టిపరిస్థితుల్లో చూడవద్దని, అసలు ఈ సినిమాలో సమాజానికి ఉపయోగపడే ఎలాంటి సందేశమూ లేదని ఆయన స్పష్టం చేశారు.
చిత్రంలో కేవలం అశ్లీలత, డ్రగ్స్ సంస్కృతి, నరకడం, చంపడం తప్ప కథాకథనాలు ఏమీ లేవని మండిపడ్డారు. స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లిన తాను, అందులోని సన్నివేశాలను చూసి తీవ్ర అసంతృప్తితో మధ్యలోనే థియేటర్ నుంచి బయటకు వచ్చేసినట్లు వెల్లడించారు. కథలు ఎంచుకునే సమయంలో నటులు, దర్శకులు మరియు నిర్మాతలు సమాజంపై ఆ చిత్రాలు చూపించే ప్రభావం గురించి బాధ్యతాయుతంగా ఆలోచించాలని ఆయన హితవు పలికారు.

ధార్మిక, ఆధ్యాత్మిక సినిమాలను ప్రోత్సహించాలి
సినిమాలు అంటే కేవలం హింస, వినోదమే కాకుండా ధర్మాన్ని, సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఉండాలని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అందులో ఆధ్యాత్మికత మరియు సమాజానికి అవసరమైన మంచి విషయాలను చక్కగా చూపించారని కొనియాడారు. అలాగే ‘ఛావా’ లాంటి సినిమాలు హిందూ ధర్మం, దేశభక్తి మరియు చారిత్రక ప్రాధాన్యతను చాటిచెబుతున్నాయని, అలాంటి మంచి చిత్రాలను ప్రేక్షకులు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. యష్ వంటి నటులు భవిష్యత్తులో నటుడిగా తమ ఇమేజ్‌ను, సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మంచి కథాంశాలు ఉన్న సినిమాలను ఎంచుకోవాలని ఆయన సూచించారు.

