Suryakumar Yadav: భారత టీ20 క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక తప్పుడు ప్రకటన (ఫేక్ స్టేట్‌మెంట్) పై తీవ్రంగా స్పందించాడు.
ఆ వ్యాఖ్యలు తాను చేసినవి కావని, అలాంటి అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని అభిమానులకు, నెటిజన్లకు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఆయన స్పష్టతనిస్తూ ఒక ప్రకటన విడుదల చేశాడు.
భారత జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అనూహ్య పరిణామాల మధ్య సూర్యకుమార్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి, అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కొత్త సారథిగా నియమించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, ఆ తర్వాతి ఇంగ్లండ్ పర్యటనతో పాటు ఆసియన్ గేమ్స్ జట్లలోనూ సూర్యకుమార్‌కు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో.. బీసీసీఐ తనకు సరైన గౌరవం ఇవ్వలేదని, తన భవిష్యత్తుపై బోర్డు నుంచి ఎలాంటి స్పష్టత రాలేదని సూర్యకుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా ఓ తప్పుడు స్టేట్‌మెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది.
Don’t believe false propaganda… Suriya clarifies regarding a viral fake statement.
Suryakumar Yadav: ఆ వ్యాఖ్యలు నేను చేయలేదు.. సూర్యకుమార్ క్లారిటీ
ఈ వివాదం పెద్దదిగా మారడంతో సూర్యకుమార్ స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చాడు. నా పేరుతో ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న ఒక స్టేట్‌మెంట్‌ను నేను గమనించాను. నేను అలాంటి వ్యాఖ్యలు ఏనాడూ చేయలేదని, ఆ పోస్టులకు ఎలాంటి అధికారం ఇవ్వలేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ధ్రువీకరించని తప్పుడు సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దు, ఇతరులకు షేర్ చేయవద్దు అని సూర్యకుమార్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ ఫేక్ వివాదానికి ముగింపు పలకాలని భావిస్తూ, టీమిండియాకు తన పూర్తి మద్దతును సూర్యకుమార్ ప్రకటించాడు. జట్టు సాధిస్తున్న విజయాల పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. భారత జట్టుకు నా శుభాకాంక్షలు ఎల్లప్పుడూ ఉంటాయి. మన కుర్రాళ్లు మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నారని నాకు తెలుసు. వారికి నా పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుంది. నాపై వచ్చే తప్పుడు ఆరోపణల కంటే భారత క్రికెట్, నా సహచర ఆటగాళ్లు, ఆటకు నేను ఇచ్చే మద్దతే ఎప్పుడూ బలంగా మాట్లాడుతుంది అని సూర్యకుమార్ భావోద్వేగంగా వివరించాడు.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రత్యేక ప్రశంసలు
ఇదే ప్రకటనలో, కేవలం 15 ఏళ్ల 99 రోజుల పిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన భారత యువ కెరటం వైభవ్ సూర్యవంశీపై సూర్యకుమార్ ప్రత్యేక ప్రశంసలు కురిపించాడు. “వైభవ్, నువ్వు ఒక అద్భుతమైన క్రికెట్ ప్రయాణం ప్రారంభంలో ఉన్నావు. మైదానంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించు, నీ ఆటతో మన దేశం గర్వపడేలా చేయాలి” అంటూ ఈ యువ ఆటగాడికి సూర్యకుమార్ తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశాడు.

