Best in Tech Survey : ఇటీవల విడుదలైన 'బెస్ట్ ఇన్ టెక్ సర్వే' రెండవ విడత ఫలితాలు వినియోగదారుల కొనుగోలు ప్రాధాన్యతలలో వస్తున్న కీలక మార్పులను ఆవిష్కరించాయి.
Amazon.in లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారిలో దాదాపు 82 శాతం మందిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు నేరుగా ప్రభావం చూపుతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. కేవలం AI మాత్రమే కాకుండా ఫోన్ పనితీరు (Performance), బ్యాటరీ లైఫ్ మరియు కెమెరా నాణ్యత కూడా కొనుగోలు నిర్ణయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాకుండా, ప్రతి ముగ్గురిలో ఒకరు తమ తదుపరి స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ కోసం Rs.50,000 లేదా అంతకంటే ఎక్కువ బడ్జెట్‌ను కేటాయించేందుకు సిద్ధంగా ఉండగా, దాదాపు సగం మంది రాబోయే మూడు నెలల్లోనే కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, కొనుగోలుదారులు కేవలం ఆఫర్లు, డిస్కౌంట్ల కంటే యూజర్ రివ్యూలు మరియు రేటింగ్‌లకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

ల్యాప్‌టాప్‌లకు ప్రత్యామ్నాయంగా టాబ్లెట్లు: మెరుగైన డిస్‌ప్లే కే ప్రాధాన్యత!
మరోవైపు టాబ్లెట్ మార్కెట్‌లో కొనుగోలుదారులు రూ. 20,000 నుండి రూ.35,000 బడ్జెట్ పరిధిలోని మిడ్-రేంజ్ ప్రీమియం టాబ్లెట్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. బడ్జెట్ డివైస్ నుండి ప్రీమియం రంగానికి అప్‌గ్రేడ్ అవ్వడానికి అత్యుత్తమ డిస్‌ప్లే నాణ్యతే ప్రధాన కారణమని తెలుస్తోంది. వినియోగదారులు ల్యాప్‌టాప్‌కు సరసమైన ప్రత్యామ్నాయంగా (29%), నాణ్యమైన మీడియా వినియోగం కోసం (21%) మరియు ప్రయాణంలో పనిచేసుకునే వీలుగా సులభంగా తీసుకెళ్లే సౌలభ్యం కోసం (17%) ఈ టాబ్లెట్లను ఎంచుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్స్, ఆడియో మరియు గృహోపకరణాల వంటి పలు విభాగాల్లో నిర్వహించిన ఈ సర్వే, ప్రతిష్టాత్మక ‘బెస్ట్ ఇన్ టెక్ అవార్డ్స్’కు ముందోచ్చిన కీలక డేటాను అందించింది.

