Pawan Kalyan: తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ తన ఉనికిని చాటేందుకు ముద్ర వేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం పార్టీ తరఫున ప్రత్యేక ప్రచార రథాన్ని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ ప్రత్యేక ‘గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ రథం ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

జనసేన అభ్యర్థి గెలుపు కోసమే ఈ విజ్ఞప్తి
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యరిధిగా బరిలో నిలిచిన డాక్టర్ గడల శ్రీనివాసరావును భారీ మెజారిటీతో గెలిపించాలని పవన్ కల్యాణ్ ఓటర్లను కోరారు. తెలంగాణలో పార్టీకి ప్రజాక్షేత్రంలో ఒక్క అవకాశం కల్పిస్తే, యువత ఆకాంక్షలకు తగినట్లుగా పరిపాలనను అందిస్తామని భరోసా ఇచ్చారు. చదువుకున్న యువత, పట్టభద్రులు తమ సమస్యల పరిష్కారం కోసం జనసేన అభ్యర్థికి మద్దతు తెలపాలని చేతులెత్తి అభ్యర్థించారు.
Pawan Kalyan: 120 రోజుల పాటు ప్రజల్లోనే ‘గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’
తెలంగాణలోని పట్టభద్రుల నియోజకవర్గాల్లో జనసేన విధానాలను, అభ్యర్థి ప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ప్రచార రథం కీలకం కానుంది. ఏకంగా 120 రోజుల పాటు ఈ ‘గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ ప్రజల మధ్యే తిరుగుతుందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై పోరాటం చేయడంతో పాటు, జనసేన సిద్ధాంతాలను ప్రతి ఒక్కరికీ చేరవేయడమే ఈ ప్రథమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
Epaper: epaper.vaartha.com

