Telangana Secretariat: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఉండే అంతస్తుకే ఆహార సరఫరా నిలిచిపోయింది.
గత రెండేళ్లుగా క్యాటరింగ్ కాంట్రాక్టర్‌కు రావాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో, ఆయన సచివాలయానికి అల్పాహారం, భోజన వసతి కల్పించడాన్ని బంద్ చేశారు. ఈ హఠాత్ పరిణామంతో సెక్రటేరియట్‌లోని ఉన్నతాధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
6వ అంతస్తులో నిలిచిన సేవలు.. ఇబ్బందుల్లో అధికారులు
సచివాలయంలోని అత్యంత కీలకమైన ఆరో అంతస్తు (6th Floor) లో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కార్యాలయాలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా పనిచేసే సిబ్బందితో పాటు ఇక్కడికి వచ్చే ఇతర ఉన్నతాధికారులకు ప్రతిరోజూ అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్నాక్స్ అందించే బాధ్యతను ఈ క్యాటరర్ చూసుకుంటున్నారు. అయితే బకాయిలను కనీసం వాయిదాల పద్ధతిలోనైనా చెల్లించాలని ఆయన పలుమార్లు అధికారులను వేడుకున్నా ఫలితం లేకపోవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Telangana Secretariat: కోట్లలో పేరుకుపోయిన బిల్లులు.. చేతులెత్తేసిన కాంట్రాక్టర్
ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు కోట్ల రూపాయల్లో ఉండటంతో.. నిత్యం ముడిసరుకులు కొనుగోలు చేయడం, వంట మనుషులు, ఇతర సిబ్బందికి జీతాలు చెల్లించడం కాంట్రాక్టర్‌కు తలకు మించిన భారంగా మారింది. దీంతో చేసేదేమీ లేక ఆయన చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటూ ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇచ్చిన హామీలతో కొందరు కాంట్రాక్టర్లు తమ నిరసనలను వాయిదా వేసుకున్నారు. ఇలాంటి తరుణంలో ఏకంగా పరిపాలనకు గుండెకాయ లాంటి ముఖ్యమంత్రి కార్యాలయానికే ఆహార సరఫరా నిలిచిపోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

