TG TET Results: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET June 2026) ఫలితాలు సోమవారం (జులై 13) విడుదలయ్యాయి. విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈ రిజల్ట్స్‌ను అధికారికంగా రిలీజ్ చేశారు.
అయితే, ఈ ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల (In-Service Teachers) ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరీక్షకు హాజరైన ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో సగానికి పైగా ఫెయిల్ కావడం విద్యా వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
Read Also:TET Notification: టీచర్లకు గుడ్ న్యూస్.. జులై 21న ప్రత్యేక టెట్ నోటిఫికేషన్!
37 శాతానికే పరిమితమైన టీచర్ల పాస్ పర్సంటేజ్

గత నెల జూన్ 16 నుండి 22 వరకు మొత్తం 10 సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో ఈ టెట్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షకు మొత్తం 1,15,028 మంది హాజరుకాగా.. జనరల్ ఉత్తీర్ణత శాతం 43.94గా నమోదైంది. మొత్తం హాజరైన వారిలో 23,623 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో కేవలం 8,809 మంది (37.29 శాతం) మాత్రమే అర్హత సాధించారు. మిగిలిన 14,814 మంది ఉపాధ్యాయులు టెట్‌లో అనుతీర్ణులు (ఫెయిల్) అయ్యారు. గత ఏడాది టీచర్ల ఉత్తీర్ణత 50 శాతంగా ఉండగా, ఈసారి అది మరింత క్షీణించింది.
2028 డెడ్‌లైన్.. సుప్రీంకోర్టు ఆదేశాలతో టెన్షన్
ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలంటూ గతంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2028 ఆగస్టు నెలలోపు టెట్‌లో ఉత్తీర్ణత సాధించని ఇన్‌సర్వీస్ టీచర్లు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో తాజా ఫలితాలు ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఉద్యోగ రక్షణ కోసం వీరంతా రాబోయే పరీక్షల్లో ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సిందే.
TG TET Results: జులై 21న 'స్పెషల్ టెట్' నోటిఫికేషన్
టెట్ ఫెయిల్ అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఊరట కలిగిస్తూ విద్యాశాఖ మరో సువర్ణ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా 'స్పెషల్ టెట్' (Special TET) నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను జులై 21న విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఈ ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ (CBT) పద్ధతిలో ప్రత్యేక టెట్ పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల..మీ స్కోర్‌కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

