Fee Reimbursement : తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC), ఈబీసీ (EBC) మరియు మైనారిటీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జూన్ నెలకు సంబంధించి రూ. 250 కోట్ల నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేసింది. విద్యా వ్యవస్థలో జాప్యానికి తావులేకుండా ఉండేందుకు.. ఇకపై ప్రతి నెలా నిరంతరాయంగా రూ. 250 కోట్ల చొప్పున ఆయా సంక్షేమ శాఖలకు నిధులను కేటాయిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిధులను నేరుగా విద్యార్థుల ఆధార్ అనుసంధాన బ్యాంక్ ఖాతాల్లోనే (Direct Benefit Transfer – DBT) మొత్తం 4 విడతల్లో జమ చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఆగస్టు 15న ఖాతాల్లోకి డబ్బులు.. దరఖాస్తుదారులకు అలర్ట్
ప్రభుత్వం ప్రకటించిన తాజా షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 1 నుండి జులై 31 వరకు కొత్తగా ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న (Fresh Applicants) అర్హులైన విద్యార్థులందరికీ రాబోయే ఆగస్టు 15వ తేదీన నేరుగా వారి అకౌంట్లలోనే నిధులు డిపాజిట్ కానున్నాయి. లబ్ధిదారులు ఈ మొత్తాన్ని అందుకున్న 7 పనిదినాల్లోగా సంబంధిత విద్యా సంస్థలకు/కాలేజీలకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ డిబిటి (DBT) విధానం ద్వారా కాలేజీల యాజమాన్యాలకు, ప్రభుత్వానికి మధ్య ఉండే గందరగోళం తొలగిపోవడమే కాకుండా విద్యార్థులకు సకాలంలో లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అర్హులైన అభ్యర్థులు గడువు ముగిసేలోగా ఈపాస్ (ePASS) పోర్టల్ ద్వారా తమ దరఖాస్తులను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
మూసీ ప్రాజెక్టులో ఎవరికీ అన్యాయం జరగదని మంత్రి పొంగులేటి హామీ

