Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆటోలు,క్యాబ్‌లు బంద్

తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆటోలు,క్యాబ్‌లు బంద్

వార్త 0 months ago

Telangana Auto Strike: తెలంగాణ రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్‌ల సేవలు నిరవధికంగా నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఆటో, యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఈ బంద్‌కు పిలుపునిచ్చింది.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది.

జేఏసీ ప్రధాన డిమాండ్లు మరియు ఆరోపణలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని జేఏసీ నాయకులు ఆరోపించారు. ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఏడాదికి రూ.12,000 ఆర్థిక సాయం (ఎరియర్స్ సహా) అందిస్తామన్న హామీ నెరవేరలేదని గుర్తుచేశారు. గత ప్రభుత్వం అందించిన రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కొనసాగించాలని, పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా మీటర్ ఛార్జీలను సవరించాలని డిమాండ్ చేశారు. అలాగే అక్రమంగా నడుస్తున్న బైక్ ట్యాక్సీ సేవలను నిషేధించి, ప్రభుత్వమే ప్రత్యేకంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

Telangana Auto Strike: డ్రైవర్ల జీవనోపాధి సమస్యలు – ఆత్మహత్యల ఆందోళన

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల తమ ఉపాధి పూర్తిగా దెబ్బతిన్నదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో గత మూడేళ్లలో సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడ్డారని జేఏసీ సభ్యులు తెలిపారు. డ్రైవర్ల ఆత్మహత్యలు పెరిగితే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జేఏసీ నాయకుడు అర్లా సత్తిరెడ్డి హెచ్చరించారు. ఈ బంద్‌కు భారతీయ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ (బీపీటీఎంఎం) కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు – హెచ్చరికలు

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7.5 లక్షల మంది ఈ రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ బంద్ కారణంగా సామాన్య ప్రయాణికులు, ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు పిలవకపోతే సమ్మెను మరింత ఉద్ధృతం చేసి, అసెంబ్లీ మరియు ప్రజా భవన్‌ను ముట్టడిస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.

సోనియా, రాహుల్ దేవుళ్లు - చిన్నారెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha