Telangana Rains: తెలంగాణలో మరోసారి వర్షాల తీవ్రత పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పలు జిల్లాలకు వర్ష సూచన ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Also :AP heavy rains: ఉత్తరాంధ్ర, రాయలసీమలో భారీ వర్ష సూచన

ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా. ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పశ్చిమ, ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అయితే ఈ వర్షాలు విస్తృతంగా కాకుండా చెదురుమదురుగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. మిగిలిన జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లోనూ వర్షాలు
హైదరాబాద్ నగరంలోనూ వర్షాల ప్రభావం కొనసాగనుంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే మంగళవారం తెల్లవారుజామున నగరంలోని ఉత్తర ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షం నమోదైంది. హైదర్‌నగర్‌లో అత్యధికంగా 38 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కూకట్‌పల్లిలో 32.3 మి.మీ., కేపీహెచ్‌బీ కాలనీలో 24 మి.మీ., మియాపూర్‌లో 21.5 మి.మీ., కుత్బుల్లాపూర్‌లో 17.8 మి.మీ. వర్షం కురిసింది. మల్కాజిగిరి, ముషీరాబాద్, పటాన్‌చెరు, బోయిన్‌పల్లి, సఫిల్‌గూడ, హఫీజ్‌పేట్ ప్రాంతాల్లోనూ వర్షపాతం నమోదైంది.
Telangana Rains: లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలు కురిసే సమయంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాలి. తూర్పు, దక్షిణ తెలంగాణ వైపు వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యవసాయ పనులు, ప్రయాణాలు, రహదారి రాకపోకల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాగులు, చెరువులు, కల్వర్టులు, లోతట్టు ప్రాంతాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

