Telangana Weather updates: తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా సమాచారం అందించింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఇది శుభవార్త.
నైరుతి రుతుపవనాలు మందగించినప్పటికీ ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయి. తెలంగాణ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి ఏర్పడటంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే 24 గంటల్లో రుతుపవనాలు రాష్ట్రం మొత్తం విస్తరిస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు మొదలవుతున్నాయి. ఎండల తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడటం ప్రజలకు ఉపశమనం కలిగిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి వంటి జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు నమోదయ్యాయి. విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. ఈ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
Heavy rains in Telangana
మూడ్రోజుల పాటు జిల్లాలో వానల హెచ్చరిక
రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బుధవారం రోజు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వానలు దంచికొట్టనున్నాయి. గురువారం రోజున పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాలకు కూడా వర్షాల ప్రభావం విస్తరిస్తుంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బలమైన గాలులు వీచే సమయంలో బయట తిరగవద్దని హెచ్చరించారు.
Telangana Weather updates: హైదరాబాద్ లో ఆహ్లాదకరమైన వాతావరణం
హైదరాబాద్ నగరంలో సోమవారం అర్ధరాత్రి నుంచి వర్షాలు మొదలయ్యాయి. ఉదయం వరకు జల్లులు కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. రాబోయే 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. వర్షం సమయంలో చెట్ల కింద, పాత భవనాల వద్ద ఆగవద్దని కోరారు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిటీలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో నగరవాసులకు ఎండ నుంచి ఉపశమనం లభించింది. ఎల్లో అలర్ట్ ఉన్నందున బయటకు వెళ్లేవారు వాతావరణ సూచనలను గమనించాలి.
Epaper: epaper.vaartha.com

