ATS To Issue Fitness Certificate : తెలంగాణ రవాణా శాఖ పరిధిలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (MVI) నిర్వహించే మాన్యువల్ ఫిట్‌నెస్ పరీక్షల విధానానికి తెరపడనుంది.
వాహనాలను క్షుణ్ణంగా పరీక్షించి, పారదర్శకంగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు (FC) జారీ చేసేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ల (ATS) ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రజా రవాణా, సరకు రవాణా చేసే భారీ, మధ్య తరహా వాహనాలు (లారీలు, బస్సులు) మరియు లైట్ మోటారు వాహనాలకు (కార్లు, జీపులు) ఇకపై ఈ కేంద్రాల్లోనే శాస్త్రీయంగా కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహించి ఎఫ్‌సీ జారీ చేస్తారు. ప్రస్తుతం పైపైన జరిపే పరీక్షలు, దళారుల ప్రమేయం మరియు అవినీతికి ఈ నూతన విధానం చెక్ పెట్టనుంది.
ATS To Issue Fitness Certificate
రూ.115 కోట్లతో రెండు క్లస్టర్లుగా నిర్మించనున్న 15 ఏటీఎస్‌లు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37 ఏటీఎస్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి దశలో 15 కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నారు. రవాణా శాఖ కార్యాలయాల ప్రాంగణాల్లో వీటి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.క్లస్టర్-1 (రూ. 61.60 కోట్లు): నిజామాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, కరీంనగర్, సంగారెడ్డి డీటీసీ ఆఫీసుల వద్ద, అలాగే దుండిగల్-1, దుండిగల్-2, మేడ్చల్ ఆర్టీవో కార్యాలయ పరిధిలో ఏటీఎస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. క్లస్టర్-2 (రూ. 53.68 కోట్లు): మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ డీటీసీ కార్యాలయాల్లోనూ, ఇబ్రహీంపట్నం ఆర్టీవో ఆఫీస్, కొండాపూర్ డ్రైవింగ్ ట్రాక్, పటాన్‌చెరు యూనిట్ ఆఫీస్ మరియు నాగోల్ డ్రైవింగ్ ట్రాక్ ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. ఈ కేంద్రాల్లో మానవ ప్రమేయం (Human Intervention) లేకుండా పూర్తిగా ఆధునిక కెమెరాలు, సెన్సార్లు మరియు అనుసంధానిత పీయూసీ (PUC) సాఫ్ట్‌వేర్ ఆధారంగా రవాణా వాహనాల కండిషన్ తనిఖీ చేస్తారు.లైటింగ్ & స్పీడ్ పరీక్షలు: హెడ్‌లైట్ అలైన్‌మెంట్ మరియు స్పీడోమీటర్ కచ్చితత్వాన్ని పరిశీలిస్తారు.సేఫ్టీ పరీక్షలు: బ్రేక్ కండిషన్, సైడ్ స్లీప్, సస్పెన్షన్ సిస్టమ్ పనితీరును డిజిటల్‌గా లెక్కిస్తారు. ఉద్గార & నిర్మాణ పరీక్షలు: వాహన ఉద్గారాలు (యాంటీ పొల్యూషన్) మరియు వాహన నిర్మాణ సమగ్రతను సమగ్రంగా తనిఖీ చేసి అర్హత కలిగిన వాహనాలకే సర్టిఫికెట్ మంజూరు చేస్తారు.

