Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో వర్షాల సీజన్ ముగిసింది.. ఇక ఉక్కపోత తప్పదా?

తెలంగాణలో వర్షాల సీజన్ ముగిసింది.. ఇక ఉక్కపోత తప్పదా?

వార్త 6 days ago

Telangana Rains: తెలంగాణలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది. ఈ ఏడాది వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ.. సీజన్ చివరి రోజుల్లో కురిసిన విస్తారమైన వర్షాలు రాష్ట్రానికి కొంత ఊరట కలిగించాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. దీంతో మొత్తం సీజన్‌లో నమోదైన వర్షపాతం లోటు కొంత మేర తగ్గింది.

Read Also :Polavaram : 'పోలవరంతో తెలంగాణకు ముప్పు'- కేంద్రానికి తెలంగాణ సర్కార్ లేఖ

నాలుగు రోజుల్లో భారీ వర్షాలు.. తగ్గిన వర్షపాతం లోటు

సెప్టెంబర్ 22 నాటికి తెలంగాణలో వర్షపాతం లోటు 34 శాతంగా నమోదైంది. అయితే ఆ తర్వాత నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవడంతో ఈ నెల వర్షపాతం లోటు 4 శాతానికి తగ్గింది. ఈ నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 52 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం. వర్షాలకు ముందు 18 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 14 జిల్లాలకు తగ్గింది. అయితే ఇప్పటివరకు ఏ జిల్లాలోనూ అధిక వర్షపాతం నమోదైన పరిస్థితి లేదని అధికారులు వెల్లడించారు.

సీజన్ మొత్తం లోటు 20 నుంచి 15 శాతానికి

నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం లోటు ఒక దశలో 20 శాతం వరకు చేరింది. చివరి రోజుల్లో కురిసిన వర్షాలతో ఈ లోటు 15 శాతానికి పరిమితమైంది. ఈ వర్షాలు వ్యవసాయ రంగానికి కొంత ఉపశమనం కలిగించడంతో పాటు పలు ప్రాంతాల్లో చెరువులు, ప్రాజెక్టులు, వాగుల్లో నీటి ప్రవాహాలు పెరిగాయి.

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద శుక్రవారం సాయంత్రానికి నీటిమట్టం 20.2 అడుగులకు చేరుకుంది. శనివారం నాటికి ఇది 30 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.

తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో 15 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పరివాహక ప్రాంతాల్లో పరిస్థితులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు భూపాలపల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా గనుల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.

Telangana Rains: వర్షాలు తగ్గి.. మళ్లీ ఉక్కపోత?

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం క్రమంగా తగ్గిపోవడంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. శనివారం నుంచి పలుచోట్ల వర్షాలు తగ్గి ఉక్కపోతతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆదివారం నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి. నైరుతి రుతుపవనాల సీజన్ ముగియడంతో రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై మరోసారి ఆసక్తి నెలకొంది. చివరి దశలో కురిసిన వర్షాలు లోటును కొంత తగ్గించినప్పటికీ.. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయన్నది కీలకంగా మారింది.

తెలంగాణలో బియ్యం కష్టాలు తప్పవా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha