AP,Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీని ప్రభావం కారణంగా రానున్న కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ముఖ్యంగా నేటి (ఆగస్టు 21) నుంచి ఈ నెల 28వ తేదీ వరకు వర్షాల జోరు కొనసాగుతుందని వాతావరణ అధికారులు వెల్లడించారు.

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవాకాశం ఉండటంతో వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
AP,Telangana Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో కూడిన వర్షాలు
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఏలూరు మరియు పోలవరం పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తీర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు
కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే మిగిలిన కోస్తా తీర ప్రాంతాల్లో అక్కడక్కడ చెదురుమదురు జల్లులు పడే ఛాన్స్ ఉంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు, ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

