Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీఎంసీకి భారీ షాక్: సుఖేందు శేఖర్ రే రాజీనామా

టీఎంసీకి భారీ షాక్: సుఖేందు శేఖర్ రే రాజీనామా

వార్త 6 days ago

Big shock for TMC: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి సంక్షోభం మరింత ముదిరింది. ఆ పార్టీ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు సుఖేందు శేఖర్ రే సోమవారం నాడు తన రాజ్యసభ పదవికి, అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

2011 నుండి తృణమూల్ కాంగ్రెస్‌లో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తూ, అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న సీనియర్ నేత పార్టీని వీడటం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పార్లమెంటుకు చేరుకుని తన రాజీనామా లేఖను సమర్పించిన సుఖేందు శేఖర్ రే, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి కూడా ఒక లేఖను పంపారు. టీఎంసీ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెచ్చరిల్లిపోవడం, మహిళల భద్రతను నిర్లక్ష్యం చేయడం, విద్య మరియు ఆరోగ్య వంటి కీలక రంగాల వెనుకబాటుతనంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును గౌరవిస్తూనే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో, బెంగాల్‌లో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులు వేయడాన్ని ఆయన అభినందించడం విశేషం.

NEET UG re exam: నీట్‌ రీ-ఎగ్జామ్‌.. రహస్య ప్రాంతంలో ప్రశ్నపత్రాల పేపర్‌ తయారుచేసిన నిపుణులను

Big shock for TMC

Big shock for TMC : బెంగాల్‌లో ముగిసిన 15 ఏళ్ల టీఎంసీ పాలన..

ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం 294 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ (BJP) ఏకంగా 207 స్థానాలను కైవసం చేసుకుని భారీ మెజారిటీతో అధికార పీఠాన్ని దక్కించుకుంది. దీంతో బెంగాల్‌లో గత 15 ఏళ్లుగా సాగుతున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పాలనకు తెరపడింది. ఈ చారిత్రాత్మక పరాజయం తృణమూల్ కాంగ్రెస్ ఉనికిని ప్రశ్నిస్తోంది. ఎన్నికల ఘోర పరాజయం తర్వాత టీఎంసీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ నాయకత్వ శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సుమారు 60 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు త్వరలోనే పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వారంతా ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో సుఖేందు శేఖర్ రే రాజీనామా చేయడం, రానున్న రోజుల్లో జరగబోయే వరుస రాజీనామాలకు సంకేతంగా కనిపిస్తోంది. విపక్షాల ‘ఇండియా’ (INDIA) కూటమి కీలక సమావేశంలో పాల్గొనడం కోసం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల వ్యూహాలపై ఆమె చర్చిస్తున్న సమయంలోనే, అటు సొంత రాష్ట్రంలో మరియు కేంద్రంలో పార్టీకి చెందిన అత్యంత సీనియర్ నేత రాజీనామా చేయడం మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha