TTD updates:తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండపై రద్దీ తగ్గించే ఉద్దేశంతో అలిపిరి వద్ద ప్రతిష్టాత్మకమైన అలిపిరి సమగ్ర యాత్రికుల పట్టణం నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో 3222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అమరావతి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో ఈ పనులకు శంకుస్థాపన చేశారు. భక్తులకు వసతి, టికెట్లు, రవాణా సేవలు అన్నీ ఒకే చోట దక్కేలా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. కొండపైకి వెళ్లే భక్తులకు కింది ప్రాంతంలోనే అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. 9 మాస్టర్ ప్లాన్ రోడ్లతో పాటు 1332 కోట్ల రూపాయలతో వసతి సముదాయాల నిర్మాణం చేపడుతున్నారు.
Tirumala Brahmotsavalu: శ్రీవారి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదే!
Alipiri Integrated Pilgrim Township
ఒక్కసారిగా వేలాది మందికి వసతి దక్కేలా భారీ మాస్టర్ ప్లాన్
ఈ టౌన్‌షిప్‌లో భక్తుల సౌకర్యార్థం భారీ వసతి కేంద్రాలు నిర్మిస్తున్నారు. 4 బ్లాకుల్లో మొత్తం 2700 గదులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కొత్త గదుల ద్వారా ప్రతిరోజూ 15000 మంది భక్తులు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే అవకాశం లభిస్తుంది. 486 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 4 పిలిగ్రిమ్ ఎమినిటీస్ కాంప్లెక్స్‌లలో ఒకేసారి 16000 మంది భక్తులకు స్నానం, విశ్రాంతి సౌకర్యాలు అందుతాయి. భక్తుల ఆకలి తీర్చేందుకు 160 కోట్ల రూపాయల వ్యయంతో భారీ అన్నప్రసాద కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఒకే సమయంలో 6000 మంది భక్తులు ప్రసాదం స్వీకరించేలా దీనిని డిజైన్ చేశారు. ప్రయాణికుల రద్దీ నియంత్రణకు 311 కోట్ల రూపాయల అంచనాతో 4500 వాహనాలు నిలిపే మల్టీ లెవల్ పార్కింగ్ అందుబాటులోకి వస్తుంది.
TTD updates:టీటీడీ ఉద్యోగుల సొంతింటి కల నెరవేరే తీపి కబురు
రవాణా సౌలభ్యం కోసం 90 కోట్ల రూపాయలతో 30 బస్ బేలు ఉండే ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్ ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు, డిజిటల్ సమాచార కేంద్రం, ఆధునిక భద్రతా వ్యవస్థలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మరోవైపు టీటీడీ సిబ్బంది సొంతింటి కల నెరవేర్చేందుకు 418 ఎకరాల్లో 2 దశల్లో 5192 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారు. ఈ నివాస లేఅవుట్‌లో రోడ్లు, మౌలిక వసతుల కోసం 230 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ సమగ్ర అభివృద్ధి పనుల ద్వారా తిరుమల యాత్ర మరింత సులభంగా మారుతుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సదుపాయాలు నేరుగా అందుతాయి.
Epaper: epaper.vaartha.com

