O Sukumari Movie: 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, 'పరేషాన్' ఫేమ్ తిరువీర్ జంటగా నటించిన సరికొత్త చిత్రం 'ఓ సుకుమారి'.
భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘ఒంట్లో కరెంట్ ఉండి ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి’ అనే ఒక వినూత్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Read Also: Samantha Seemantham in Chittoor: చిత్తూరులో సమంత సీమంతం వేడుకలు.. ఫోటోలు వైరల్!
Review of the movie ‘O Sukumari’ starring Thiruveer and Aishwarya Rajesh!
O Sukumari Movie: కథ ఏమిటంటే?
మహారాష్ట్ర నుంచి కరీంనగర్ జిల్లాలోని ధూమ్ పల్లి అనే గ్రామానికి సుకుమారి ఉరఫ్ దామిని (ఐశ్వర్య రాజేష్) తన తండ్రితో కలిసి వస్తుంది. పుట్టుకతోనే ఒక వింత సమస్యతో జన్మించిన దామినికి గుండె వేగం సాధారణ స్థాయిని దాటితే చాలు… శరీరం నుంచి హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ షాక్‌లు వస్తుంటాయి. ఈ వింత లోపం వల్ల చిన్నప్పుడే ఆమెకు అమ్మ ప్రేమ దూరమవుతుంది. కనీసం దగ్గరికి రావడానికి కూడా చుట్టుపక్కల వారు భయపడుతుంటారు.
అలాంటి పరిస్థితుల్లో దామినిని తొలిచూపులోనే చూసి ఇష్టపడతాడు యాదగిరి (తిరువీర్). దామినికున్న వింత వ్యాధి నిజాన్ని దాచేసి, ఊరంతా ఏకమై యాదగిరికి ఇచ్చి పెళ్లి జరిపిస్తారు. పెళ్లి తర్వాత వాళ్ల జీవితంలో ఎలాంటి అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి? అసలు నిజం తెలిసిన తర్వాత భర్త యాదగిరి ఏం చేశాడు? భార్యపై ఉన్న ప్రేమతో ఆ సమస్యను ఎలా తగ్గించగలిగాడు? అనేదే ఈ సినిమా కథ.
విశ్లేషణ
ఒంట్లో కరెంట్ ఉండే అమ్మాయి అనే వినూత్నమైన పాయింట్ ఐడియా పరంగా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే తెరపై ప్రెజెంట్ చేయడంలో మాత్రం దర్శకుడు అక్కడక్కడా తడబడినట్లు అనిపిస్తుంది. ఈ వైవిధ్యమైన పాయింట్‌ను స్క్రిప్ట్ పరంగా ఇంకా బలంగా రాసుకుని ఉంటే కచ్చితంగా ఇదొక మైండ్‌బ్లోయింగ్ సూపర్ ఉమెన్ సినిమా అయ్యుండేది. హీరోయిన్ ఎవరిని తాకినా షాక్ కొట్టడం అనే మెయిన్ ప్లాట్ చుట్టూ మరింత క్రేజీ ఫన్ జనరేట్ చేసే స్కోప్ ఉన్నప్పటికీ, దర్శకుడు ఆ అవకాశాన్ని పూర్తిగా వాడుకోలేకపోయాడు.
సినిమా మొదలైనప్పటి నుండి కథనం సాఫీగానే సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ప్రేక్షకుడికి అసలైన ట్విస్ట్ ఎదురవుతుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త పర్వాలేదనిపిస్తూ కథను ముందుకు నడిపించగా, క్లైమాక్స్ ఎపిసోడ్ బాగానే మెప్పిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ తాకినప్పుడు కొన్నిసార్లు షాక్ కొట్టడం, మరికొన్ని కీలక పరిస్థితుల్లో అసలు షాక్ కొట్టకపోవడం అనే ట్విస్టుల చుట్టూ అల్లుకున్న స్క్రీన్‌ప్లే మైండ్ గేమ్‌లా సాగుతూ ఆకట్టుకుంటుంది. వీటన్నింటికీ మించి అసలు ఆ అమ్మాయి ఒంట్లోకి అంత కరెంట్ ఎలా వచ్చింది? ఆ షాక్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనే మెయిన్ పాయింట్‌ను చివర్లో ఎమోషనల్‌గా ‘అమ్మ ప్రేమ’తో ముడిపెట్టి ముగించిన విధానం హృదయాలను హత్తుకుంటుంది.
నటీనటులు, సాంకేతిక వర్గం పనితీరు
షాక్ ఇచ్చే సుకుమారిగా ఐశ్వర్య రాజేష్ అదరగొట్టింది. తన న్యాచురల్ యాక్టింగ్ ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్. తిరువీర్ మరోసారి తనదైన అమాయకపు నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా హీరోయిన్‌తో వచ్చే లవ్ సీన్స్ అన్నీ బాగున్నాయి. మురళీధర్ గౌడ్, శ్రీనివాస్ గవిరెడ్డి, ఆమని, ఆనంద్, ఝాన్సీ, అంజి మామ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సంగీత దర్శకుడు భరత్ మంచిరాజు అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (RR) పర్లేదు. కుషేందర్ సినిమాటోగ్రఫీ బాగుంది, విలేజ్ సెటప్‌ను అందంగా చూపించారు. ఎడిటింగ్ ఓకే అనిపించినా, కొన్ని అనవసర సీన్లు కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడు భరత్ దర్శన్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా.. ఎగ్జిక్యూషన్ మీద ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది.
ముగింపు
ఓవరాల్‌గా చెప్పాలంటే.. ‘ఓ సుకుమారి’ ఒక వైవిధ్యమైన షాకుల సుందరి కథ. కథనంలో కొన్ని లోపాలున్నప్పటికీ, వీకెండ్‌లో కొత్త కాన్సెప్ట్ చిత్రాలను ఇష్టపడేవారు సరదాగా నవ్వుకోవడానికి ఈ సినిమాను ఒకసారి ట్రై చేయవచ్చు.
Epaper: epaper.vaartha.com
థియేటర్లలోకి వచ్చేసిన 'మిస్టర్ మిడిల్ క్లాస్'.. పూర్తి మూవీ రివ్యూ!

