TCS: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు ఈసారి నిరాశ ఎదురైంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ మిడిల్ మరియు సీనియర్ స్థాయి ఉద్యోగులకు సగటున కేవలం 60 నుండి 70 శాతం మాత్రమే వేరియబుల్ పేను చెల్లించినట్లు ప్రముఖ ఆర్థిక వార్తా సంస్థ మనీకంట్రోల్ నివేదించింది.
అంతకుముందు రెండు త్రైమాసికాల్లో ఇదే ఉద్యోగులకు సుమారు 80 శాతం వరకు వేరియబుల్ పే లభించడం గమనార్హం.

మార్జిన్లపై ప్రభావం చూపిన ఏఐ పెట్టుబడులు మరియు జీతాల పెంపు
ప్రస్తుత త్రైమాసికంలో టీసీఎస్ ఆపరేటింగ్ మార్జిన్ 24 శాతంగా నమోదైంది. అంతకుముందు క్వార్టర్‌తో పోలిస్తే ఇది 130 బేసిస్ పాయింట్లు తగ్గింది. భవిష్యత్తు టెక్నాలజీలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాలపై కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతుండటం, అలాగే ఉద్యోగుల జీతాల పెంపు వంటి అంశాలు మార్జిన్లపై ప్రభావం చూపినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. భవిష్యత్తు వృద్ధికి అవసరమైన పెట్టుబడులకే ప్రాధాన్యత ఇస్తామని టీసీఎస్ సీఎఫ్‌వో సమీర్ సెక్సారియా స్పష్టం చేశారు.
ఇన్ఫోసిస్‌లోనూ తగ్గిన వేరియబుల్ పే ధోరణి
కేవలం టీసీఎస్‌లోనే కాకుండా మరో ప్రధాన ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌లోనూ ఉద్యోగుల వేరియబుల్ పేలో కోత పడింది. ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు మొదటి త్రైమాసికంలో సగటున 70 శాతం మాత్రమే వేరియబుల్ పే చెల్లించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ చెల్లింపుల్లో కొంత తగ్గుదల నమోదు కావడం ఐటీ రంగంలో చర్చనీయాంశంగా మారింది.
TCS: వేరియబుల్ పేతో అనుసంధానమైన ఆఫీస్ అటెండెన్స్ నిబంధనలు
టీసీఎస్ ఉద్యోగుల వేరియబుల్ పే తగ్గిపోవడానికి ఆఫీస్ హాజరు (Attendance) కూడా ఒక ముఖ్యమైన కారణంగా నిలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1 నుంచి కంపెనీ వేరియబుల్ పేను ఉద్యోగుల ఆఫీస్ అటెండెన్స్‌తో ముడిపెట్టింది. నిబంధనల ప్రకారం..
- 85% లేదా అంతకంటే ఎక్కువ హాజరు: పూర్తి వేరియబుల్ పే.
- 75% – 85% హాజరు: గరిష్ఠంగా 75 శాతం.
- 60% – 75% హాజరు: 50 శాతం వరకు మాత్రమే.
- 60% కంటే తక్కువ హాజరు: క్వార్టర్లీ వేరియబుల్ పే పూర్తిగా రద్దు.
Epaper: epaper.vaartha.com

