Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తుఫాన్ ప్రభావంపై కేంద్ర హోమంత్రికి చంద్రబాబు లేఖ

తుఫాన్ ప్రభావంపై కేంద్ర హోమంత్రికి చంద్రబాబు లేఖ

వార్త 3 weeks ago

Cyclone Arnab: అర్నాబ్ తుపాను సృష్టించిన విధ్వంసం, రాష్ట్రంలో వాటిల్లిన భారీ ఆస్తి మరియు పంట నష్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు బుధవారం లేఖ రాశారు.

తుపాను కారణంగా రాష్ట్రంలో ఊహించని నష్టం జరిగిందని, దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు తక్షణమే కేంద్ర బృందాలను పంపాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో తుపాను సహాయక చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

Cyclone Arnab: అర్నాబ్ బీభత్సం.. రాకాసి అలల ఉద్ధృతికి సుమారు 30 ఇళ్లు నేలమట్టం

తుపాను తీవ్రత, కుండపోత వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు, ఇళ్లు, రహదారులు ,విద్యుత్ స్తంభాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని సీఎం వివరించారు. ముఖ్యంగా కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉందని పేర్కొన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట నీట మునిగిందని, 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. తీర ప్రాంతాల్లో అనేక రహదారులు ధ్వంసం కాగా, సుమారు 180 ఇళ్లు దెబ్బతిన్నాయని, 220కి పైగా చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్టు స్పష్టం చేశారు.

Cyclone Arnab: ప్రాణనష్టం లేకపోవడం ఊరట

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగా ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాకపోవడం ఊరటనిచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. తుపాను ప్రభావిత 14 జిల్లాల్లో సహాయక చర్యల కోసం 16 ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF), 11 ఎస్డీఆర్‌ఎఫ్‌ (SDRF) బృందాలను మోహరించినట్లు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల నుంచి ఇప్పటికే 28 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావాస కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు. బాధితులకు తక్షణ సాయం, విద్యుత్ మరియు తాగునీటి సరఫరాను పునరుద్ధరించడంపై యంత్రాంగం నిరంతరం దృష్టి సారించిందని, అత్యవసర ఆపరేషన్స్ కేంద్రాలు నిరంతరం పనిచేస్తున్నాయని వివరించారు.

కేంద్ర బృందాన్ని పంపాలని సీఎం విజ్ఞప్తి

తుపాను నష్టంపై పూర్తిస్థాయి అంచనా పూర్తయిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పిస్తామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సహాయక చర్యలకు కేంద్ర సంస్థల సహకారం ఇలాగే కొనసాగాలని కోరారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అంచనా వేసేందుకు వీలైనంత త్వరగా కేంద్ర అధ్యయన బృందాన్ని ఆంధ్రప్రదేశ్‌కు పంపాలని అమిత్ షాను ఆయన మరోసారి కోరారు.

Epaper: epaper.vaartha.com

తుఫాన్ బాధితులకు సీఎం భరోసా.. మీకు ప్రభుత్వం అండగా ఉంది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha