తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. దళపతి విజయ్ నేతృత్వంలోని TVK (తమిళగ వెట్రి కళగం) పార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది.
ఈ చారిత్రాత్మక మార్పుపై బహుముఖ ప్రజ్ఞాశాలి, నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని అప్రతిహతంగా ప్రారంభించారు. మొత్తం 234 స్థానాలకు గానూ టీవీకే పార్టీ 107 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. దశాబ్దాల చరిత్ర ఉన్న డీఎంకే 74 స్థానాలకు, అన్నాడీఎంకే 53 స్థానాలకు పరిమితమయ్యాయి. స్వయంగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన కంచుకోట అయిన కొలత్తూర్ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓటమి పాలవ్వడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్ మరియు తిరుచ్చి ఈస్ట్.. రెండు చోట్లా ఘనవిజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.
Read Also : దళపతి విజయ్ ఆస్తుల తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!
Tamil Nadu Election Resultsప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్
ఈ ఫలితాలపై స్పందిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. “తమిళనాట చరిత్రలో కామరాజు ఓడిపోయారు.. స్టాలిన్ ఓడిపోయారు. సమాజం కేవలం అభిమానుల మయం అయిపోయింది” అంటూ ఆయన పరోక్షంగా విజయ్ విజయం వెనుక కేవలం సినీ గ్లామర్ మరియు ఫ్యాన్ బేస్ మాత్రమే ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ చైతన్యం కలిగిన సమాజం మారలేదనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని పేర్కొన్న ఆయన, ఓటు వేసిన ప్రజల విజ్ఞతను తనదైన శైలిలో ప్రశ్నించారు. రాజకీయ పరిజ్ఞానాన్ని పెంచే మేధావుల పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేయడం గమనార్హం.
గందరగోళంలో రాజకీయ వర్గాలు: ఎవరిని విమర్శించినట్లు?
ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు విశ్లేషణలకు వేదికైంది. ఆయన ఏ పార్టీని నేరుగా విమర్శించనప్పటికీ, ఆయన వ్యాఖ్యల అంతరార్థం మాత్రం ప్రజాస్వామ్యం కంటే సినీ ఆరాధనకే ప్రజలు పట్టం కట్టారని అర్థం వచ్చేలా ఉంది. ఒకవైపు విజేతలకు శుభాకాంక్షలు చెబుతూనే, మరోవైపు సమాజంలో రాజకీయ పరిపక్వత లోపించిందని అనడం ద్వారా ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 1996 తర్వాత స్టాలిన్ తొలిసారి ఓడిపోవడం, మరోవైపు మాజీ సీఎం పళనిస్వామి 90 వేల భారీ మెజారిటీతో గెలవడం వంటి పరిణామాల మధ్య.. ప్రకాష్ రాజ్ చేసిన ఈ ‘మేధోపరమైన విమర్శ’ సోషల్ మీడియాలో టీవీకే మద్దతుదారుల ఆగ్రహానికి, ప్రతిపక్షాల మద్దతుకు కారణమవుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

