Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత.. గణేశ్ నిమజ్జన ఆంక్షలపై ఉత్సవ సమితి రచ్చ

ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత.. గణేశ్ నిమజ్జన ఆంక్షలపై ఉత్సవ సమితి రచ్చ

వార్త 1 week ago

Tank Bund Tension: హైదరాబాద్‌లోని ప్రముఖ ట్యాంక్‌బండ్‌పై గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం అంశం మరోసారి తీవ్ర వివాదాస్పదంగా మారింది. హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్ బండ్ వైపు విగ్రహాలను నిమజ్జనం చేయకూడదంటూ అధికారులు విధించిన ఆంక్షలను వ్యతిరేకిస్తూ భాగ్యనగర్ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రతినిధులు ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలో ఉత్సవ సమితి నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరగడంతో ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

 Tension at Tank Bund: Festival Committee protests against Ganesh immersion restrictions.

Tank Bund Tension: రోడ్డుపై బైఠాయింపు.. బారికేడ్ల తొలగింపునకు యత్నం

ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల నిమజ్జనానికి యథావిధిగా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉత్సవ సమితి ప్రతినిధులు అక్కడ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించారు.

వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది. ఈ తోపులాటలో పలువురు పోలీసులు కిందపడిపోగా, ఉన్నతాధికారులు అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

కోర్టు ఆదేశాలు.. పర్యావరణ పరిరక్షణ నిబంధనలు

తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం పర్యావరణ పరిరక్షణ కోసం హుస్సేన్‌సాగర్‌లో, ముఖ్యంగా ట్యాంక్‌బండ్‌ వైపు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) విగ్రహాల నిమజ్జనాన్ని నియంత్రిస్తున్నామని జీహెచ్‌ఎంసీ మరియు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ట్యాంక్‌బండ్‌ నుంచి నేరుగా విగ్రహాలను సాగర్‌లో పడవేయకుండా 10 అడుగుల ఎత్తైన ఇనుప రైలింగ్‌ను నిర్మించారు. అలాగే ఇక్కడ నిమజ్జనం నిషేధించబడినట్లు హెచ్చరిక ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ ప్రాంతాలలో మట్టి విగ్రహాల నిమజ్జనానికి క్రేన్లను అందుబాటులో ఉంచారు. పీఓపీ విగ్రహాల కోసం ప్రత్యేకంగా కృత్రిమ కొలనులను (బేబీ పాండ్స్) సిద్ధం చేస్తున్నారు.

ఉత్సవ సమితి హెచ్చరికలు

అధికారులు చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను భాగ్యనగర్ గణేశ్‌ ఉత్సవ సమితి ఖండిస్తోంది. ట్యాంక్‌బండ్ అనేది దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయ నిమజ్జన ప్రాంతమని, అక్కడే కార్యక్రమానికి అనుమతించాలని పట్టుబడుతోంది. ప్రభుత్వం క్రేన్లు ఏర్పాటు చేయకపోతే తమ సొంత ఖర్చులతో క్రేన్లు తెచ్చి నిమజ్జనాలు చేస్తామని ఉత్సవ సమితి ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవైపు న్యాయస్థానం ఆదేశాలు, పర్యావరణ పరిరక్షణ నిబంధనలు.. మరోవైపు సంప్రదాయాల పేరుతో ఉత్సవ సమితి పట్టుదల మధ్య ట్యాంక్‌బండ్ వద్ద ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయోనని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha