Uttarandhra : విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి, జల వనరుల వినియోగంపై కీలక ప్రకటనలు చేశారు.
రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర ప్రాంతం ఆర్థికంగా, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెంది ‘ఉన్నతాంధ్ర’గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిన ఉత్తరాంధ్ర ప్రజల పరిస్థితులు మారి, భవిష్యత్తులో ఉద్యోగాలు, వ్యాపార అవకాశాల కోసం ఇతర ప్రాంతాల నుంచి జనం ఇక్కడికే వలస వచ్చేలా సమగ్ర ప్రణాళికలతో అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రాంతీయ అసమానతలను తొలగించి, ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పాయకరావుపేట సభ వేదికగా ఆయన స్పష్టం చేశారు.

నదుల అనుసంధానం - సింహాద్రి అప్పన్నకు గోదావరి జలాలు
రాష్ట్రంలోని అన్ని నదులను అనుసంధానం చేసి ‘తెలుగు తల్లికి జల హారతి’ ఇచ్చే భారీ నీటిపారుదల ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని సీఎం ప్రకటించారు. వచ్చే ఏడాది నాటికి సింహాద్రి అప్పన్న పాదాల వద్దకు గోదావరి జలాలను తరలించి, ఉత్తరాంధ్రలోని సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మాటిచ్చారు. అలాగే, గోదావరి జలాలు తరలివచ్చిన ఈ పవిత్ర దినమే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం కావడం విశేషమని పేర్కొంటూ, ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకుని ప్రజలతో సభలో చప్పట్లు కొట్టించి శుభాకాంక్షలు తెలిపారు.

