Varuna Yagam : తెలంగాణ రాష్ట్రంలో ఎల్నినో ప్రతికూల ప్రభావం తగ్గి, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలనే సత్సంకల్పంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'వరుణ యాగం' నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద కృష్ణా నదీ తీరాన వేకువజామున 4:05 గంటలకు వైభవంగా ప్రారంభమైంది.
వేద పండితుల మంత్రోచ్ఛారణలు, సాంప్రదాయ గోపూజతో ఈ ఆధ్యాత్మిక క్రతువుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఈ యాగంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగార్జున సాగర్ జలాశయం సమీపాన పవిత్ర నదీ జలాల సాక్షిగా జరుగుతున్న ఈ యజ్ఞం రాష్ట్రంలో కరువు కాటకాలు తొలిగి, జలాశయాలన్నీ జలకళతో తొలకడలాడాలని ఆకాంక్షిస్తూ సాగుతోంది.

మధ్యాహ్నం పూర్ణాహుతి - హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఈ మహా క్రతువు ముగింపు ఘట్టానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:45 గంటలకు నాగార్జున సాగర్ వద్దకు చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:24 గంటలకు నిర్వహించే అత్యంత పవిత్రమైన 'పూర్ణాహుతి' కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు, దైవ దర్శనం చేసుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం సంతోషంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడాలని ప్రభుత్వం తరఫున సీఎం ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద ఎత్తున వేద పండితులు హాజరయ్యారు.

