Rains : భారతదేశంలో ఒకవేళ వర్షపాతం సాధారణం కంటే తగ్గి, వానల లోటు గనుక కొనసాగితే అది దేశ ఆర్థిక వృద్ధి (Economic Growth) పై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ 'ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్' (S&P Global Ratings) హెచ్చరించింది.
మన దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ఎంతగానో కీలకం కావడమే దీనికి ప్రధాన కారణం. గత మే నెలలో ద్రవ్యోల్బణం (Inflation) 3.93 శాతంగా నమోదవ్వగా, వర్షాలు సరిగ్గా పడకపోతే రాబోయే ఆర్థిక సంవత్సరం FY27 నాటికి ఇది ఏకంగా 5.1 శాతానికి పెరిగే ప్రమాదం ఉందని సంస్థ అంచనా వేసింది. వర్షాలు లేక పంటలు పండకపోతే ఆహార సంక్షోభం ఏర్పడి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దెబ్బ.. ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షాభావ పరిస్థితుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించే అవకాశం ఉంది. దీని ప్రభావం ఆటోమొబైల్ రంగంపై నేరుగా పడుతుందని, ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కువగా విక్రయమయ్యే ట్రాక్టర్లు, టూవీలర్ల విక్రయాలు (Sales) 5 నుండి 10 శాతం వరకు తగ్గొచ్చని ఎస్ అండ్ పీ గ్లోబల్ అంచనా వేసింది. ఈ విధమైన ఆర్థిక మందగమనాన్ని అధిగమించడానికి ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలని సూచించింది. గ్రామీణ ప్రాంత ప్రజలను ఆదుకోవడానికి 'VB GRAMG' వంటి ఉపాధి హామీ పథకాలను మరింత విస్తృతంగా అమలు చేయాలని, అలాగే రైతులకు ఊరటనిచ్చేలా ఎరువులు (Fertilizers), ఆహార ధాన్యాలపై ఇచ్చే ప్రభుత్వ సబ్సిడీలను పెంచడం అత్యంత ఆవశ్యకమని నివేదికలో స్పష్టం చేసింది.

