హైదరాబాద్ నగర భవిష్యత్తును, పర్యావరణాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనకాడబోదని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యంత స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
నగరంలోని చెరువులు, నాలాలను కబ్జా చేసి నిర్మించిన ఇళ్లను, అక్రమ కట్టడాలను కచ్చితంగా కూల్చివేస్తామని ఆయన తేల్చి చెప్పారు. ప్రతిష్టాత్మక ‘వే2న్యూస్ కాంక్లేవ్ 2026’ (Way2News Conclave) వేదికగా ఆయన శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు. కబ్జాదారులు ఎంతటి రాజకీయ, ఆర్థిక బలవంతులైనా సరే, వారి వెనుక ఎవరున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం ఉద్ఘాటించారు. అక్రమ నిర్మాణాల్లో ఉన్నవారు ముందుగానే ఖాళీ చేస్తే, ఇంట్లోని సామాగ్రిని సురక్షితంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుందని, లేనిపక్షంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు.
Read Also : బండి భగీరథ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్

సోషల్ మీడియా ప్రచారాలు చెల్లవు
ప్రభుత్వం చేపడుతున్న అక్రమ కట్టడాల కూల్చివేతలపై సోషల్ మీడియాలో లేదా కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న తప్పుడు పోస్టులు, వ్యతిరేక ప్రచారాల వల్ల ఎలాంటి లాభం ఉండదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “యుద్ధాలు జరిగినప్పుడు అమాయకులు కూడా బలవుతుంటారు, అలాగే నగర శ్రేయస్సు కోసం కఠిన నిర్ణయాలు అనివార్యమవుతాయి” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఒకరోజు ముందు లేదా ఒకరోజు వెనుక అయినా సరే, చెరువుల గర్భంలో వెలిసిన కబ్జాలను కూల్చేయడం 100 శాతం ఖాయమని తేల్చి చెప్పారు. పేద ప్రజలకు నష్టం కలగకుండా ప్రభుత్వం తరఫున డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, తగిన పునరావాస చర్యలు అందిస్తున్నామని, అయితే కొందరు రాజకీయ స్వార్థం కోసం ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.
వెనక్కి తగ్గేదే లేదు
హైదరాబాద్ నగరానికి గుండెకాయ వంటి మూసీ నది పునరుజ్జీవనం మరియు సుందరీకరణ ప్రాజెక్టును (Musi Riverfront Development) ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మానవ తప్పిదాల వల్ల మురికికూపంగా మారిన మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా రాబోయే తరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) లో కేసులు వేసినా ఈ ప్రాజెక్టు ఆగేది లేదని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వంగా తాము సమాజం కోసమే పని చేస్తున్నామని, నగర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని రేవంత్ రెడ్డి ఈ వేదిక ద్వారా ప్రతిపక్షాలకు, కబ్జాదారులకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

