Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి.
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నానితో పాటు పలువురు ముఖ్య నేతలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇరువర్గాల ఫిర్యాదులతో తాడేపల్లిలో టెన్షన్.. కౌంటర్ కేసులు నమోదు!
పోలీసుల సమాచారం ప్రకారం.. తాడేపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) స్వయంగా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఒక కేసు నమోదైంది. దీనికి తోడు తాడేపల్లి తెలుగు విద్యార్థి సంఘం అధ్యక్షుడు రాయపూడి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదుతో మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నిందితుల జాబితాలో అంబటి రాంబాబు, పేర్ని నానిలతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, పనుగంటి చైతన్య, వేమారెడ్డి తదితరులు ఉన్నారు. అమరావతి ప్రాంత రైతులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కూడా పోలీసులు కొందరు వైసీపీ నేతలపై చర్యలు చేపట్టారు.
మరోవైపు, అమరావతి పర్యటనలో తమపై దాడులు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదును కూడా పోలీసులు స్వీకరించారు. దీనిపై స్థానిక రైతులపై కౌంటర్ కేసులు నమోదు చేశారు. ఈ రెండు వర్గాల పోటాపోటీ కేసుల వల్ల తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రెండు వైపుల నుంచి అందిన ఫిర్యాదులపై ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.
Read hindi news : hindi.vaartha.com

