Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వందేభారత్ స్లీపర్ హైదరాబాద్‌కు ఎప్పుడొస్తుంది?

వందేభారత్ స్లీపర్ హైదరాబాద్‌కు ఎప్పుడొస్తుంది?

వార్త 3 weeks ago

Vande bharat sleeper train:ఆధునిక హంగులు, అత్యాధునిక వసతులతో కూడిన వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఇప్పటికే ఉత్తరాదిలో సేవలు అందిస్తున్న ఈ రైళ్లు, తాజాగా బెంగళూరు-ముంబై మార్గంలో పట్టాలెక్కాయి. దీంతో దక్షిణాదిలోనూ ఈ సర్వీసులు విస్తరిస్తుండటంతో, హైదరాబాద్‌ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రవేశపెట్టాలనే డిమాండ్ ప్రయాణికుల నుంచి వ్యక్తమవుతోంది.

Bullet Train Update: వేగంగా ముంబై-అహ్మదాబాద్ కారిడార్ పనులు

 Vande Bharat Sleeper… when will it arrive in Hyderabad?

దక్షిణాదిలో మొదలైన వందేభారత్ స్లీపర్ ప్రయాణం

దేశంలోనే తొలిసారిగా ఈశాన్య ప్రాంతంలోని గౌహతి (కామాఖ్య) నుంచి కోల్‌కతా మధ్య వందేభారత్‌ స్లీపర్‌ రైలును ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీ-వారణాసి మార్గంలోనూ ఇవి అందుబాటులోకి రాగా, తాజాగా బెంగళూరు-ముంబై మధ్య కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. దక్షిణాదిలో ఈ రైలు తొలిసారిగా అందుబాటులోకి రావడంతో, హైదరాబాద్‌ నుంచి కూడా వివిధ ప్రధాన నగరాలకు వీటిని నడపాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్‌-న్యూఢిల్లీతో పాటు సికింద్రాబాద్‌-అయోధ్య (వయా వారణాసి) మార్గాల్లో వందేభారత్ స్లీపర్లను ప్రవేశపెట్టాలనే డిమాండ్ బలంగా ఉంది.

వందేభారత్ స్లీపర్ ప్రత్యేకతలు

  • ఈ రైళ్లు పూర్తిగా ఏసీ సదుపాయాన్ని కలిగి ఉంటాయి.
  • మొత్తం 16 బోగీలతో పుష్‌పుల్‌ సాంకేతికతతో ఇవి నడుస్తాయి.
  • గంటకు 130 నుండి 160 కి.మీ వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందించారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి సీటర్లే..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్టణం వరకు రెండు వందేభారత్‌లు, సికింద్రాబాద్‌-తిరుపతి, కాచిగూడ-బెంగళూరు మధ్య వందేభారత్‌ సీటర్‌ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. వీటిలో ప్రయాణికులు కూర్చొని మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి, సుదీర్ఘ ప్రయాణాలకు ఇవి అంతగా అనుకూలంగా ఉండవు. అందుకే స్లీపర్ రైళ్ల కోసం ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరిగింది.

Vande bharat sleeper train:తగ్గనున్న ప్రయాణ సమయం

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైళ్లను నడిపే సామర్థ్యాన్ని పెంచారు. కాజీపేట నుంచి ఢిల్లీ వరకు గ్రాండ్‌ట్రంక్‌ మార్గంలో మూడో మార్గం దాదాపుగా అందుబాటులోకి వచ్చింది. దీనికి తోడు రైల్వే రక్షణ కవచ్‌ వ్యవస్థ, ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థలు అందుబాటులోకి రావడంతో రైళ్లు మరింత వేగంగా పరుగులు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో గంటల తరబడి ప్రయాణించాల్సి వస్తుండగా, వందేభారత్‌ స్లీపర్‌లతో హైదరాబాద్‌-న్యూఢిల్లీ మధ్య ప్రయాణ సమయం చాలా వరకు తగ్గనుంది.

ఇతర రైళ్ల పరిస్థితి ఏంటి?

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 200 కి.మీ. కంటే తక్కువ దూర ప్రాంతాలకు ‘నమో భారత్‌ ర్యాపిడ్‌’ (లోకల్‌ ఇంటర్‌సిటీ పుష్‌పుల్‌ ఏసీ) రైళ్లను ప్రవేశపెడతామని ప్రతిపాదించినప్పటికీ, ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. మరోవైపు హమ్‌సఫర్, జనశతాబ్ది, ఉదయ్‌ డబుల్‌ డెక్కర్, సంపర్క్‌ క్రాంతి, అంత్యోదయ లాంటి రైళ్లు సైతం ఇప్పటివరకు కేటాయించకపోవడం గమనార్హం. ఇంటర్‌సిటీ రైళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఎక్కువగా రోడ్డు మార్గాలపైనే ఆధారపడాల్సి వస్తోంది.

Epaper: epaper.vaartha.com

పట్టాలెక్కిన వందే భారత్ స్లీపర్ రైలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha