Warangal news: సాధారణంగా పంటలు బాగా పండే భూమికి విపరీతమైన గిరాకీ ఉంటుంది. కానీ, వరంగల్ జిల్లాలోని ఓ ఆరెకరాల వ్యవసాయ భూమికి మాత్రం పంటలతో సంబంధం లేకుండా ఊహించని డిమాండ్ ఏర్పడింది.
ఆ భూమిని కౌలుకు తీసుకుంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావచ్చనే ప్రచారంతో స్థానిక రైతులు, సామాన్య జనం దాని కోసం పోటీ పడుతున్నారు. ఇటీవల ఆ పొలంలో పురాతన బంగారు ఆభరణాలు బయటపడటంతో ఈ లంకెబిందెల భూమి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Also : Telangana weather update: తెలంగాణకు భారీ వర్ష సూచన.. జులై 4 వరకు ఎల్లో అలర్ట్
'Golden' land in Warangal district… midnight digging for treasure!
Warangal news: పత్తి చేనులో కలుపు తీస్తుండగా దొరికిన బంగారం
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలోని ఈ ఆరెకరాల భూమిని పదేళ్ల క్రితం ఒక వ్యక్తి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈర్యతండాకు చెందిన ఒక రైతు ఈ భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నారు. జూన్ 24న వర్షాలు పడటంతో చేనులో కలుపు తీసేందుకు మహిళా కూలీలు పనికి వెళ్లారు. వారు మట్టిని తవ్వుతుండగా, అనుకోకుండా పురాతన కాలం నాటి కొన్ని బంగారు ఆభరణాలు లభించాయి. మొదట ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని చూసినా, గుసగుసలు కాస్తా ఊరంతా వ్యాపించాయి. భూమి యజమాని కూలీలను విచారించగా, వారు దొరికిన బంగారాన్ని అప్పగించారు. వెంటనే యజమాని ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించారు.
గతంలోనూ బయటపడ్డ కాకతీయుల కాలం నాటి నిధులు
ఈ భూమిలో బంగారం దొరకడం ఇదే మొదటిసారి కాదని గ్రామస్థులు చెబుతున్నారు. శతాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయాలు ఉండేవని, కాలక్రమేణా అవి భూమిలో కలిసిపోయాయని స్థానికంగా గట్టి నమ్మకం ఉంది. 1991లో అప్పటి భూ యజమానికి వ్యవసాయ పనుల్లో భాగంగా పెద్ద మొత్తంలో బంగారం లభించింది. ఆ తర్వాత అదే పొలంలో పనిచేసిన ఒక పాలేరుకు కూడా కొన్ని పురాతన బంగారు నాణేలు దొరికాయి. ఇతర సందర్భాల్లో పొలం దున్నుతున్న సమయంలో పలుమార్లు పురాతన దేవతా విగ్రహాలు కూడా లభించాయి. తాజా ఘటనతో ఈ భూమి కింద ఇంకా పెద్ద ఎత్తున గుప్తనిధులు (లంకెబిందెలు) ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది.
ఈ వ్యవహారం పోలీసుల వద్దకు చేరడంతో ఈ భూమిని గతంలో అమ్మేసిన పాత యజమాని కుమారుడు సోమవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అది తమ తాతల కాలం నాటి భూమి అని, అందులో దొరికిన నిధిపై చట్టపరంగా తమకే పూర్తి హక్కు ఉంటుందని ఆయన వాదిస్తున్నారు. దొరికిన బంగారాన్ని పంచుకున్న వారిపై చర్యలు తీసుకుని, ఆ నిధిని తమకు అప్పగించాలని డిమాండ్ చేయడంతో హక్కుల పోరాటం మొదలైంది.
అర్ధరాత్రుళ్లు టార్చ్ లైట్లు, గునపాలతో తవ్వకాలు
పొలంలో బంగారం దొరికిందనే వార్త చుట్టుపక్కల గ్రామాలకు దావాగ్నిలా వ్యాపించింది. దీంతో వందలాది మంది ప్రజలు ప్రతిరోజూ ఆ పొలానికి క్యూ కడుతున్నారు. పగటిపూట పోలీసులు, రెవెన్యూ అధికారుల నిఘా ఉండటంతో, జనం సరికొత్త దారి వెతికారు. అర్ధరాత్రుళ్లు టార్చ్ లైట్లు, గునపాలతో పొలంలోకి చొరబడి నిధి కోసం విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నారు. ఓవైపు నిధి హక్కులపై వివాదం, మరోవైపు జనం అర్ధరాత్రి తవ్వకాలతో ఈ ‘బంగారు’ భూమి వ్యవహారం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది.
రిటైర్డ్ ఉద్యోగులకు తీపి కబురు.. ఖాతాల్లోకి రూ.2 వేల కోట్లు జమ!

