Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వయనాడ్ టన్నెల్ ప్రాజెక్ట్‌లో కొండచరియలు విరిగి ఇద్దరు మృతి

వయనాడ్ టన్నెల్ ప్రాజెక్ట్‌లో కొండచరియలు విరిగి ఇద్దరు మృతి

వార్త 2 weeks ago

Wayanad Landslide: కేరళలోని వయనాడ్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం వయనాడ్‌లోని ఒక టన్నెల్ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో భారీస్థాయిలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. దీంతో ఘటనా స్థలంలో రెస్క్యూ టీమ్‌లు భారీస్థాయిలో సహాయక చర్యలు చేపట్టాయి.

మలప్పురం, వయనాడ్ జిల్లాలను అనుసంధానించేలా ‘అనక్కొంపోయిల్-మెప్పాడి’ సొరంగ మార్గ (టన్నెల్) ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణ ప్రాంతానికి సమీపంలోని కల్లాడి వద్ద, మీనాక్షి వంతెన దగ్గర మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ నిర్మాణ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కొండచరియలు కుప్పకూలడంతో ప్రాజెక్టు పనుల కోసం వినియోగించే కొన్ని వాహనాలు కూడా భారీగా దెబ్బతిన్నాయి.

Read Also : Girish Bharadwaj:'బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా' గిరీశ్ భరద్వాజ్ కన్నుమూత!

 Two killed in landslide at Wayanad tunnel project site.

Wayanad Landslide: రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, రక్షణ సేవల సిబ్బందితో పాటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కేరళ రెవెన్యూ మంత్రి ఏపీ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. వయనాడ్, కోజికోడ్ ప్రాంతాల నుండి సుమారు 60 మంది సభ్యులతో కూడిన రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్లో పాలుపంచుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆరుగురు గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి నిలకడగా ఉంది. అయితే శిథిలాల కింద ఇంకా సుమారు 10 మంది వరకు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యమే కారణం

ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి మంగళవారం ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి టి. సిద్ధిక్‌తో అత్యవసర సమావేశం నిర్వహించారు. సహాయ, పునరావాస చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, మంత్రులు ఏపీ అనిల్ కుమార్, టి. సిద్ధిక్ స్వయంగా అక్కడికి వెళ్లి పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. మరోవైపు ఈ ప్రమాదంపై మంత్రి టి. సిద్ధిక్ తీవ్రంగా స్పందించారు. ఇది సహజంగా జరిగిన ప్రమాదం కాదని, పూర్తిగా “మానవ తప్పిదం”, నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపించారు.

నిర్మాణ ప్రాంతం నుండి మట్టిని తొలగించాలని జూన్ 20న జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను పాటించడంలో టన్నెల్ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ విఫలమయ్యారని సీఎం కూడా పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ లిఖితపూర్వకంగా హెచ్చరించినప్పటికీ కొంకణ్ రైల్వేస్ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని మంత్రి విమర్శించారు. గతంలో 298 మంది ప్రాణాలు బలిగొన్న ముండక్కై కొండచరియల దారుణాన్ని గుర్తు చేస్తూ.. ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

వయనాడ్‌కు ఐఎండీ ‘రెడ్ అలర్ట్’ హెచ్చరిక

గత 24 గంటల్లో ఈ ప్రాంతంలో ఏకంగా 265 మి.మీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా మనంథవాడి, వైతిరి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) వయనాడ్ జిల్లాకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, కొండ ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

వయనాడ్‌లో మళ్లీ విరిగిపడిన కొండచరియలు: శిథిలాల కింద చిక్కుకున్న పలువురు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha