Veligonda Victims : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. మార్కాపురం జిల్లా గంటవానిపల్లెలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును రేపు అధికారికంగా జాతికి అంకితం చేయనున్నారు.
ఈ చారిత్రాత్మక సందర్భంలో ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ భూములను, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. సీఎం చేతుల మీదుగా దాదాపు 10,000 నిర్వాసిత కుటుంబాలకు సుమారు రూ. 3,000 విలువైన స్పెషల్ నిత్యావసర కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కిట్‌లో 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, చక్కెర, రెండు కిలోల చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలు మరియు ఒక లీటర్ వంటనూనె వంటి అత్యవసర సరుకులను అందిస్తున్నారు.

మహిళలకు ప్రత్యేక సత్కారం – పునరావాస సహాయం
ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల్లోని మహిళల సంక్షేమం మరియు వారి త్యాగాలను గౌరవిస్తూ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 6,000 మంది నిర్వాసిత మహిళలకు నిత్యావసర సరుకులతో పాటు ప్రత్యేకంగా చీర, గాజులు, పసుపు, కుంకుమలతో కూడిన మంగళద్రవ్యాల కిట్లను అందజేయనున్నారు. ఈ సహాయ కార్యక్రమాలు నిర్వాసితుల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను, అంకితభావాన్ని తెలియజేస్తున్నాయి. వెలిగొండ ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో ఫ్లోరైడ్ రహిత తాగునీరు మరియు వేలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా, ప్రాజెక్టు పునరావాస ప్రాంతాల్లోని బాధితులకు తగిన సహాయక చర్యలు అందించడం ద్వారా ప్రాంతీయ సమగ్ర అభివృద్ధికి ఈ పర్యటన దారితీస్తుందని భావిస్తున్నారు.

