Veligonda Project: శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. గంటవానిపల్లి హెడ్ రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతరం గేట్లు ఎత్తి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను నల్లమల సాగర్ జలాశయంలోకి విడుదల చేశారు.
అక్కడే వెలిగొండ ప్రాజెక్టు శిలాఫలకాన్ని కూడా ప్రారంభించారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు 2026లో ఆయన చేతుల మీదుగానే వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం కానుండటం విశేషం. ప్రాజెక్టును మొదలుపెట్టిన, ప్రాజెక్టును పూర్తి చేసిన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచారు.
Read Also : Veligonda Phase-1 : 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. నేడు వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం
Krishna waters released into the Veligonda project; Chandrababu performs ‘Jalaharathi’!
Veligonda Project: లక్షలాది ఎకరాలకు సాగునీరు.. కోట్లాది మందికి తాగునీరు
వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగు నీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని 4.473 లక్షల ఎకరాలకు ఓవరాల్‌గా సాగునీరు అందనుంది. అదేవిధంగా ఈ నాలుగు జిల్లాల్లోని 23 లక్షల మంది ప్రజలకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. శ్రీశైలం జలాలను కొల్లం వాగు మీదుగా వెలిగొండ నుంచి నల్లమల సాగర్‌కు తరలిస్తారు.
నల్లమల సాగర్ జలాశయం వివరాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంటవానిపల్లె హెడె రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదల చేసిన తర్వాత శ్రీశైలం జలాలను నల్లమల సాగర్ జలాశయానికి మళ్లిస్తారు. అక్కడ 53.85 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. ప్రస్తుతం 10.70 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నల్లమల సాగర్ జలాశయం నుంచి మూడు కాల్వల ద్వారా ఆయకట్టుకు నీరందిస్తారు. ఈ నల్లమల సాగర్‌లో ముంపునకు గురయ్యే 11 గ్రామాలను ఇప్పటికే ప్రభుత్వం ఖాళీ చేయించింది. వారికి అందాల్సిన నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని కూడా ప్రభుత్వం దాదాపు అందించింది.
వలసలకు సెలవు.. అభివృద్ధికి స్వాగతం: వెలిగొండపై మంత్రి లోకేశ్ ట్వీట్!

