Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెనిజువెలాలో భారీ జంట భూకంపాలు

వెనిజువెలాలో భారీ జంట భూకంపాలు

వార్త 1 week ago

Venezuela Earthquake: వెనిజువెలాలో బుధవారం (జూన్ 24) సాయంత్రం సంభవించిన రెండు వరుస తీవ్ర భూకంపాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా కరీబియన్ తీరప్రాంతం ఈ భారీ విపత్తుతో కంపించిపోయింది.

రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రధాన నగరాల్లో భవనాలు నేలమట్టమవడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఒకవైపు భూకంప భయం, మరోవైపు సునామీ హెచ్చరికలతో తీరప్రాంత దేశాల ప్రజలు రాత్రంతా తీవ్ర ఆందోళనతో గడిపారు.

నిమిషం వ్యవధిలో రెండు భారీ ప్రకంపనలు

యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) నివేదికల ప్రకారం.. కారకాస్‌కు పశ్చిమంగా 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొరోన్ అనే ప్రాంతం కేంద్రంగా ఈ భూకంపాలు సంభవించాయి. మొదట 7.1 తీవ్రతతో భూమి కంపించగా, సరిగ్గా తర్వాతి నిమిషంలోనే అదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించింది. భూ అంతర్భాగంలో కేవలం 10 నుండి 13 కిలోమీటర్ల స్వల్ప లోతులోనే ఈ ప్రకంపనలు కేంద్రీకృతం కావడం వల్ల నష్టం తీవ్రత ఊహించని స్థాయిలో ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Venezuela Earthquake: కారకాస్‌లో శిథిలమైన భవనాలు.. చీకట్లోకి నగరాలు

భూమి ఒక్కసారిగా విలయతాండవం చేయడంతో ప్రాణభయంతో జనం ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. రాజధానిలోని అల్టామిరా వంటి ప్రముఖ ప్రాంతాలు, అలాగే తీర నగరమైన లా గుఐరాలో బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లు, నివాస గృహాలు కుప్పకూలాయి. కూలిన భవనాల నుంచి దట్టమైన ధూళి మేఘాలు గాల్లోకి లేవడంతో స్థానికంగా భీతావహ వాతావరణం నెలకొంది. విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో నగరాలు చీకట్లోకి వెళ్లాయి. ఇది సహాయక చర్యలకు పెద్ద ఆటంకంగా మారింది.

పరిస్థితిపై దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో స్పందిస్తూ.. అల్టామిరా రీజియన్‌లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందన్నారు. తదుపరి ప్రకంపనలు (Aftershocks) వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్లలోకి వెళ్లకుండా బహిరంగ ప్రదేశాల్లోనే సురక్షితంగా ఉండాలని కోరారు. అత్యవసర సేవల కోసం అంబులెన్సుల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని వాహనదారులను విజ్ఞప్తి చేశారు.

తీర ప్రాంతాలకు సునామీ ముప్పు హెచ్చరికలు

ఈ భారీ విపత్తు కారణంగా పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తక్షణమే స్పందించింది. ప్యూర్టో రికో, వెనిజులా తీరాలతో పాటు యూఎస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌కు సునామీ ముప్పు ఉందని అడ్వైజరీ జారీ చేసింది. సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశం ఉందని హెచ్చరించినప్పటికీ, సుమారు గంట తర్వాత సముద్రం శాంతించడంతో అధికారులు ఈ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు.

భౌగోళికంగా కరీబియన్, దక్షిణ అమెరికా టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దుల్లో ఉండటం వల్ల వెనిజువెలా నిరంతరం భూకంపాల ముప్పును ఎదుర్కొంటూనే ఉంటుంది. 1821 నాటి చారిత్రక స్వాతంత్ర్య యుద్ధ విజయానికి గుర్తుగా దేశమంతటా సెలవు దినం జరుపుకుంటున్న రోజే ఈ విషాదం చోటుచేసుకోవడం గమనార్హం. 1967లో వచ్చిన వినాశకర భూకంపం కంటే కూడా దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ ముమ్మరంగా శ్రమిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha