Tamil Nadu Budget 2026 : తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కజగం (TVK) నాయకత్వంలోని విజయ్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌లో ప్రజాకర్షక సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా మహిళలు, విద్యార్థులు మరియు నవజాత శిశువుల కోసం భారీగా నిధులను కేటాయించారు. ప్రధానంగా వివాహ కానుక కింద అర్హులైన ప్రతి వధువుకు 8 గ్రాముల బంగారం (1 తులం) మరియు పట్టుచీర అందించే కొత్త పథకానికి ప్రభుత్వం రూ. 812 కోట్లను కేటాయించింది. దీనితో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే పసిపిల్లల కోసం ‘తాయ్ మామన్ తంగ మోదిర తిట్టం’ కింద 1 గ్రాము బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చేందుకు రూ. 560 కోట్లు కేటాయించి, సామాన్య కుటుంబాలకు అండగా నిలిచే దిశగా శ్రీకారం చుట్టింది.
విద్యా రంగానికి ప్రాధాన్యం, విద్యుత్ ఉపశమనం మరియు మైనార్టీ వరం
యువతలో డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు మరియు విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు ‘వెట్రి మడికణిని తిట్టం’ కింద కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌ల పంపిణీకి రూ. 2,000 కోట్లను అలొకేట్ చేశారు. గృహ వినియోగదారుల విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రకటించారు. అలాగే మైనార్టీ సంక్షేమంపై దృష్టి సారిస్తూ, తొలిసారి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఇచ్చే సబ్సిడీని రూ. 25,000 నుంచి రూ. 35,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. సామాజిక భద్రత, విద్యాభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ విజయ్ సర్కార్ రూపొందించిన ఈ తొలి బడ్జెట్ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

