Palathalikalu Recipe: వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుడికి సంప్రదాయ నైవేద్యంగా బెల్లం పాల తాలికలు తయారుచేసుకోవచ్చు. బియ్యప్పిండి, సగ్గుబియ్యం, పాలు, బెల్లంతో చేసే ఈ పాయసం ఎంతో రుచిగా ఉంటుంది.
పక్కా కొలతలు, కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే మొదటిసారి చేసేవారు కూడా రుచికరమైన పాల తాలికలను సులభంగా తయారు చేయవచ్చు.
కావాల్సిన పదార్థాలు
- సన్న సగ్గుబియ్యం - 2 టేబుల్‌స్పూన్లు
- బియ్యప్పిండి - 1 కప్పు
- నీళ్లు - 2 కప్పులు
- బెల్లం - 1 కప్పు
- చిక్కటి పాలు - 2½ కప్పులు
- నెయ్యి - 1 టేబుల్‌స్పూన్
- యాలకుల పొడి - ½ టీస్పూన్
- జీడిపప్పు - 3 టేబుల్‌స్పూన్లు
- ఎండు ద్రాక్ష - 1 టేబుల్‌స్పూన్
సగ్గుబియ్యాన్ని నానబెట్టాలి

ముందుగా సన్న సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, పూర్తిగా మునిగేంత నీళ్లు పోయాలి. సుమారు 30 నిమిషాల నుంచి గంట వరకు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతుంది.
బియ్యప్పిండి ముద్ద తయారీ
ఒక పాన్‌లో 1 కప్పు నీళ్లు పోసి మరిగించాలి. అందులో 2 టేబుల్‌స్పూన్ల బెల్లం వేసి పూర్తిగా కరిగించాలి. బెల్లంలో మలినాలు ఉంటే సిరప్‌ను వడగట్టుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, అందులో బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. మిశ్రమం ముద్దలా మారిన తర్వాత మూతపెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టాలి. ముద్ద కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని మెత్తగా కలపాలి. పిండి సాఫ్ట్‌గా, పగుళ్లు లేకుండా ఉండేలా చూసుకోవాలి.
బెల్లం సిరప్ సిద్ధం చేయాలి
మరో పాన్‌లో 1 కప్పు బెల్లం, ¼ కప్పు నీళ్లు వేసి బెల్లం పూర్తిగా కరిగే వరకు కలపాలి. కరిగిన తర్వాత లో-మీడియం మంటపై సుమారు ఒక నిమిషం మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. బెల్లం సిరప్‌ను పక్కన పెట్టుకోవాలి. మందపాటి గిన్నెలో 1 కప్పు నీళ్లు, 2½ కప్పుల పాలు పోసి వేడి చేయాలి. పాలు వేడెక్కుతున్నప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి మీడియం మంటపై ఉడికించాలి. బియ్యప్పిండి ముద్దలో నుంచి ఒక నిమ్మకాయ సైజు ముద్దను విడిగా తీసి పెట్టుకోవాలి. మిగిలిన పిండిని జంతికల గొట్టంలో పెట్టుకోవాలి. పాలు రెండు పొంగులు వచ్చిన తర్వాత జంతికల గొట్టంతో పిండిని నేరుగా మరుగుతున్న పాలలోకి తాలికలుగా ఒత్తాలి. అన్నీ వేసిన తర్వాత వెంటనే కలపకూడదు. సుమారు 5 నిమిషాలు మీడియం మంటపై ఉడికించాలి. వెంటనే కలిపితే తాలికలు విడిపోయే అవకాశం ఉంటుంది.
పాయసం చిక్కబడేలా చేయాలి
విడిగా పెట్టుకున్న నిమ్మకాయ సైజు పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, ½ కప్పు కాచి చల్లార్చిన పాలు పోసి ఉండలు లేకుండా కలపాలి. తాలికలు ఉడికాయో లేదో స్పూన్‌తో నొక్కి చూసి నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత సిద్ధం చేసుకున్న పిండి-పాల మిశ్రమాన్ని నెమ్మదిగా పాలలో పోస్తూ కలపాలి. లో-ఫ్లేమ్‌పై మరో 4-5 నిమిషాలు ఉడికించాలి. పాయసం క్రమంగా చిక్కబడుతుంది. చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి.
బెల్లం సిరప్ చివర్లోనే కలపాలి
పాయసం గోరువెచ్చగా ఉన్నప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం సిరప్‌ను వడగట్టి నెమ్మదిగా పోయాలి. పాయసం బాగా వేడిగా ఉన్నప్పుడే బెల్లం వేస్తే పాలు విరిగే అవకాశం ఉంటుంది. అందుకే కొద్దిగా చల్లారిన తర్వాతే బెల్లం సిరప్ కలపడం ముఖ్యం. ఇప్పుడు ½ టీస్పూన్ యాలకుల పొడి వేసి నెమ్మదిగా కలపాలి.
Palathalikalu Recipe: జీడిపప్పు, ఎండు ద్రాక్షతో గార్నిష్
చిన్న పాన్‌లో 1 టేబుల్‌స్పూన్ నెయ్యి వేడి చేయాలి. జీడిపప్పు వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అనంతరం ఎండు ద్రాక్ష వేసి అవి ఉబ్బే వరకు వేయించాలి. ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని నెయ్యితో సహా పాల తాలికల పాయసంలో వేసి నెమ్మదిగా కలపాలి. అంతే.. రుచికరమైన బెల్లం పాల తాలికలు సిద్ధం. వినాయక చవితి రోజున ఈ సంప్రదాయ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు.

