Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం

వార్త 2 weeks ago

South Coast Railway zone: ఆంధ్రప్రదేశ్ రవాణా రంగ చరిత్రలో ఒక నూతన శకం ఆరంభమైంది. ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్న దేశ 18వ రైల్వే జోన్ 'దక్షిణ కోస్తా రైల్వే' (SCoR) విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా సోమవారం నుంచి అధికారికంగా తన సేవలను ప్రారంభించింది.

ప్రత్యేక పరిపాలన, మౌలిక వసతుల పెంపు కోసం దశాబ్దాలుగా సాగిన సుదీర్ఘ పోరాటానికి ఈ పరిణామంతో శుభం కార్డ్ పడినట్లయింది.

 Visakhapatnam Railway Zone

నాలుగు డివిజన్లతో కొత్త జోన్ .. రాబడి రూ.15,500 కోట్లు!

దక్షిణ మధ్య రైల్వే (SCR), ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) పరిధిలోని కొన్ని కీలక ప్రాంతాలను పునర్వ్యవస్థీకరించి ఈ నూతన జోన్‌ను రూపుదిద్దారు.

పరిధిలోని డివిజన్లు: విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్. మొత్తం 385 రైల్వే స్టేషన్లతో విస్తరించిన ఈ జోన్‌లో దాదాపు 62,000 మంది ఉద్యోగులు సేవలందించనున్నారు. సాధారణ రోజుల్లో 500 ప్యాసింజర్ సర్వీసులు, 800 గూడ్స్ రైళ్లను ఈ జోన్ నిర్వహించనుంది. వార్షికంగా సుమారు రూ.15,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని అంచనా. విశాఖపట్నం, గంగవరం, కృష్ణపట్నం, కాకినాడతో పాటు త్వరలో రాబోయే మూలపేట పోర్టుల అనుసంధానంతో సరుకు రవాణా, మల్టీమోడల్ లాజిస్టిక్స్ రంగాలు ఊపందుకోనున్నాయి.

Read also: Sai Sudha Play School: తిరుపతిలో సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్ ప్రారంభం!

South Coast Railway zone: పండుగ వాతావరణంలో ఉత్తరాంధ్ర: హర్షం వ్యక్తం చేసిన నేతలు

కొత్త రైల్వే జోన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని పలు రైల్వే స్టేషన్లను సందర్శించి స్థానికులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు.

“దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యరూపం దాల్చడం ఆంధ్రప్రదేశ్ ప్రజల, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం నెరవేరిన చారిత్రాత్మక ఘట్టం. ఇచ్ఛాపురం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత బోర్డును చూసినప్పుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది” అని మంత్రి రామ్మోహన్ నాయుడు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఈ జోన్ రాకతో ప్రాంతీయ రవాణా రూపురేఖలు మారడమే కాకుండా, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

1980ల నాటి సుదీర్ఘ పోరాట ప్రస్థానం

విశాఖ రైల్వే జోన్ సాధన వెనుక నలభై ఏళ్లకు పైగా సాగిన ప్రజా ఉద్యమ చరిత్ర ఉంది. గతంలో తెలుగు మాట్లాడే ప్రాంతాలను చెన్నై కేంద్రంగా ఉన్న దక్షిణ రైల్వే నుంచి మార్చినప్పటికీ, వ్యూహాత్మక వాల్తేరు డివిజన్‌ను మాత్రం కోల్‌కతా పరిధిలోనే ఉంచారు. ఆ తర్వాత 1997లో అది భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) కిందికి వెళ్ళింది. దీనివల్ల నియామకాల్లో వివక్ష, ప్రయాణికుల సమస్యల నిర్లక్ష్యం వంటి ఎన్నో ఇబ్బందులను ఏపీ ఎదుర్కొంది.

దీనిపై 2010లో జరిగిన భారీ ‘రైల్ రోకో’ వంటి ఎన్నో ఆందోళనలు జరిగాయి. 2014 రాష్ట్ర విభజన చట్టంలో ఈ హామీ చేర్చబడగా.. 2019లో కేంద్ర ప్రభుత్వం జోన్ ఏర్పాటును ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు వేగవంతం కాగా, 2025 జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.149 కోట్ల వ్యయంతో జోనల్ హెడ్‌క్వార్టర్స్ భవనానికి శంకుస్థాపన చేశారు. గతేడాది జూన్‌లో సందీప్ మాథుర్ ఈ జోన్ తొలి జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎట్టకేలకు ఈ జోన్ ప్రారంభం కావడంతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మరింత వేగవంతం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

తిరుపతి-రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha