Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విశాఖ రైల్వే జోన్ సాకారం.. ఇచ్చాపురంలో ప్రారంభించిన మంత్రి రామ్మోహన్ నాయుడు!

విశాఖ రైల్వే జోన్ సాకారం.. ఇచ్చాపురంలో ప్రారంభించిన మంత్రి రామ్మోహన్ నాయుడు!

వార్త 3 weeks ago

South Coast Railway Zone: 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ఫలితం… ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం. విశాఖ రైల్వే జోన్' సాకారం.. కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు.

ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌లో ఘనంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభోత్సవ కార్యక్రమం. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే కల సాకారం కావడం గర్వకారణం. భావోద్వేగానికి లోనైన కేంద్ర మంత్రి. శ్రీకాకుళం జిల్లాలో రూ.3,300 కోట్లతో 50కి పైగా ఆర్‌ఓబీల మంజూరు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.

Read Also :Vishakha : విశాఖ కేంద్రంగా నేటి నుండి రైల్వే కార్యకలాపాలు ప్రారంభం

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌లో అత్యంత వైభవంగా నిర్వహించిన రైల్వే జోన్ ప్రారంభోత్సవ అధికారిక కార్యక్రమంలో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు అత్యంత భావోద్వేగంతో మాట్లాడుతూ, విశాఖ రైల్వే జోన్ సాధన కోసం గత 12 సంవత్సరాలుగా తాను సాగించిన సుదీర్ఘ పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో పార్లమెంట్‌లో ఈ అంశంపై అనేకసార్లు గళమెత్తానని, ఇదే ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌లో ప్రజాప్రతినిధిగా దీక్షలు కూడా చేపట్టానని పేర్కొన్నారు. “అనాడు ఒక సామాన్య ప్రజాప్రతినిధిగా ప్రజల పక్షాన నిలబడి పోరాడాను.. ఈరోజు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణంలోనే ఆ కల సాకారం కావడం, నా చేతుల మీదుగానే ఈ జోన్ ప్రారంభం కావడం నా జీవితంలో ఎప్పటికీ మరువలేని మహత్తర ఘట్టం” అని హర్షం వ్యక్తం చేశారు.

ఈ రోజు నుండి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక పరిపాలన ప్రారంభమైందని కేంద్ర మంత్రి వెల్లడించారు. నూతన జోన్ ఏర్పాటుతో ఈ ప్రాంత రైల్వే సమస్యలకు స్థానికంగానే త్వరితగతిన పరిష్కారాలు లభిస్తాయని, పరిపాలన మరింత సులభతరం అవుతుందని చెప్పారు. గతంలో స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు కూడా ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ సాధించడమే లక్ష్యంగా విశేష కృషి చేశారని, వారి ఆశయాలను ఈరోజు నెరవేర్చగలిగామని సగర్వంగా ప్రకటించారు. దాదాపు పుష్కర కాలంగా ఈ పవిత్ర ఆకాంక్షను భుజాలపై మోస్తూ, చివరకు అనుకున్నది సాధించామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా రూ.3,300 కోట్ల భారీ వ్యయంతో 50కి పైగా రైల్వే ఓవర్ బ్రిడ్జిలు మంజూరయ్యాయని వివరించారు. ఇందులో ఇచ్చాపురం ప్రాంతానికి కూడా ఒక కీలకమైన ఆర్‌ఓబీ మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చాపురం పట్టణ ప్రజలను దశాబ్దాలుగా వేధిస్తున్న వంతెన సమస్యకు ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలోనే పూర్తిస్థాయి ముగింపు పలుకుతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. పట్టణ ప్రగతికి, ప్రజల రవాణా సౌకర్యాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా శాశ్వత పరిష్కారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే, నూతనంగా సాధించిన పూరి-అహ్మదాబాద్ రైలు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, భవిష్యత్తులో ఈ రైలు సేవలు నేరుగా ఇచ్చాపురం నుంచే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటానని తన ఆకాంక్షను వెల్లడించారు.

South Coast Railway Zone: రూ.400 కోట్లతో ప్రధాన కార్యాలయ నిర్మాణం
విశాఖపట్నంలో 54 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో, సుమారు రూ.400 కోట్ల అంచనా వ్యయంతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులు ఇప్పటికే శరవేగంగా ప్రారంభమయ్యాయని కేంద్ర మంత్రి సమాచారం అందించారు. ఈ చారిత్రాత్మక పండుగ తరుణంలో తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన రైల్వే జోన్‌ను మంజూరు చేసిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇందుకు నిరంతరం సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి జిల్లా ప్రజల తరఫున కేంద్ర మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు.

ఇచ్చాపురం సరిహద్దు ప్రాంతమైన ఏ.ఎస్.పేట సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద సౌత్ కోస్ట్ రైల్వే జోన్ బోర్డును ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడే మొక్కలు నాటారు. అనంతరం ఇచ్చాపురం మున్సిపాలిటీ 22వ వార్డులో లబ్ధిదారులకు సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు, వికలాంగులు, ఇతర లబ్ధిదారులతో మంత్రి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బహిరంగ సభలో మాట్లాడి అనంతరం రైలులో ఇచ్చాపురం నుంచి పలాస బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, జిల్లా ఉన్నతాధికారులు, రైల్వే శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఏపీ విద్యార్థులకు తీపికబురు.. జేఈఈ, నీట్ ఉచిత కోచింగ్.. 4200 మందికి అవకాశం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha