Chandrababu Naidu: విశాఖపట్నం తీరంలో చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను తీవ్రతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న సీఎం, ఈ ప్రమాద విషయం తెలియగానే వెంటనే ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

సాంకేతిక లోపమే కారణమా?
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 1వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో ‘INDAP-VS-MM-83’ నంబరు గల బోటులో ఏడుగురు మత్స్యకారులు విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం వారు 4వ తేదీ మధ్యాహ్నానికే తిరిగి రావాల్సి ఉంది. అయితే, గంగవరం తీరానికి సమీపంలో బోటులో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లే వారు చిక్కుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
Chandrababu Naidu: రంగంలోకి నేవీ హెలికాప్టర్.. ముమ్మరంగా శోధన
మత్స్యకారుల రక్షణ కోసం కోస్ట్‌గార్డ్, నౌకాదళం (నేవీ), మెరైన్ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. గాలింపును మరింత వేగవంతం చేసేందుకు ఈ ఉదయం నుంచి నేవీ హెలికాప్టర్‌ను కూడా వినియోగిస్తున్నారు.
మెరైన్ ఐజీ, విశాఖ సీపీలు సమన్వయం చేసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాలని, తాజా అప్‌డేట్స్‌ను తనకు ఎప్పటికప్పుడు నివేదించాలని సీఎం ఆదేశించారు. అలాగే బాధితుల కుటుంబాలకు ధైర్యం చెప్పి, తోడుగా నిలవాలని మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను చంద్రబాబు కోరారు.
Epaper: epaper.vaartha.com
విశాఖ తీరంలో విషాదం: సముద్రంలో వేటకు వెళ్లి ఏడుగురు మత్స్యకారులు గల్లంతు

