Nara Lokesh: విశాఖపట్నంలోని లిటిల్ గార్డెన్ ప్రైవేట్ పాఠశాలలో ఆరేళ్ల బాలుడు ప్రణయ్ తేజ్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని, ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అమానుష ఘటనకు కారకులైన వారిపై, పాఠశాల యాజమాన్యంపై చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కష్ట సమయంలో మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

సోషల్ మీడియా వేదికగా స్పందన
ఈ హృదయవిదారక ఘటనపై మంత్రి లోకేశ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించారు. “విశాఖలోని లిటిల్ గార్డెన్ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ కొట్టడంతో ఆరేళ్ల ప్రణయ్ తేజ్ మృతి చెందడం అత్యంత బాధాకరం. బాధ్యులైన వారిపై, సంబంధిత పాఠశాల యాజమాన్యంపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రణయ్ తేజ్ తల్లిదండ్రులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. మీరు ధైర్యంగా ఉండండి, మీకు కలిగిన ఈ తీరని లోటును ఎవ్వరూ పూడ్చలేరు. మా ప్రభుత్వం మీకు అన్నివిధాలా అండగా ఉంటుంది” అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Nara Lokesh: హోమ్‌వర్క్ చేయలేదన్న కోపంతోనే దారుణం
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలే కర్కశంగా వ్యవహరించడం పట్ల స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హోమ్‌వర్క్ పూర్తి చేయలేదనే చిన్న కారణంతో బాలుడిని ఉపాధ్యాయురాలు తీవ్రంగా కొట్టడంతోనే ప్రణయ్ తేజ్ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడని బంధువులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నారుల పట్ల పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

