Vizag Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్లాంట్‌లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, గుట్టుచప్పుడు కాకుండా 'టోటల్ ఆపరేషన్ మెయింటినెన్స్ కాంట్రాక్టు' (TOMC) విధానాన్ని వేగవంతం చేస్తోంది.
ఈ నయా విధానం పరోక్షంగా ఉక్కు పరిశ్రమలోని పలు కీలక విభాగాల ఉనికిని దెబ్బతీసేలా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టిఒఎంసి విధానం ద్వారా ప్లాంట్‌లోని ప్రధాన విభాగాలను బడా కాంట్రాక్టు సంస్థలకు ధారాదత్తం చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఈ నూతన విధానంలో భాగంగా యాజమాన్యం పిలిచిన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EOI) టెండర్ల ద్వారా ప్లాంట్‌లోని కీలకమైన ‘సింటర్ ప్లాంట్’ను ప్రముఖ టాటా సంస్థ ఇప్పటికే దక్కించుకుంది. టాటాతో పాటు మరికొన్ని బడా కంపెనీలు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తున్నా, ఆ సంస్థల వివరాలను యాజమాన్యం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గతంలో అమలులో ఉన్న టిఎంసి (టోటల్ మెయింటినెన్స్ కాంట్రాక్టు) విధానం వల్లనే కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంతో ఉత్పత్తి విభాగాలు కునారిల్లిపోగా, ఇప్పుడు ఏకంగా ఆపరేషన్లను కూడా ప్రైవేట్ చేతుల్లో పెట్టడం పట్ల కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Pawan Kalyan: పోలవరంలో పులి కలకలం.. అటవీ శాఖకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు!
‘TOMC’ policy in Visakhapatnam Steel: Steps towards privatization?
Vizag Steel Plant: బకాయిల సెగ
ప్రస్తుతం ఉక్కు ప్లాంట్‌లోని కోక్ ఒవెన్, ఆర్‌ఎంహెచ్‌పి, పవర్ ప్లాంట్, బ్లాస్ట్ ఫర్నేస్ వంటి విభాగాల్లో సరైన మెయింటినెన్స్ లోపించింది. రస్ట్ క్లియరెన్స్ సరిగ్గా లేకపోవడంతో ఉత్పత్తిపై, యంత్రాల సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఎప్పుడు ఏ మెటీరియల్ విరిగి నెత్తిన పడుతుందో తెలియని భయానక పరిస్థితుల్లో కార్మికులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు సుమారు రూ. 860 కోట్ల మేర కార్మికుల జీతాల బకాయిలు నిలిచిపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
ఉద్యోగ భద్రతకు ముప్పు..
కొత్తగా అమలు చేయబోయే టిఒఎంసి విధానం ప్రకారం భవిష్యత్తులో శాశ్వత ఉద్యోగులను, ప్రస్తుత కాంట్రాక్టు కార్మికులను కొనసాగించడానికి వీల్లేకుండా టెండరు నిబంధనల్లోనే పేర్కొన్నట్లు సమాచారం. దీనివల్ల కొత్త రిక్రూట్‌మెంట్‌లకు పూర్తిగా గండి పడనుంది. గతంలో ఉన్న నియమాల ప్రకారం రిక్రూట్‌మెంట్‌లో పర్మినెంట్ కార్మికులకు 50 శాతం, నిర్వాసితులకు 50 శాతం వాటా ఉండేది. కానీ ప్రస్తుత టెండర్లతో ఉక్కు యాజమాన్యం ఆ హక్కులను రద్దు చేసింది. ఇప్పటికే బడా కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల నుండి హిందీ మాట్లాడే కార్మికులను రంగంలోకి దించుతుండటంతో స్థానిక యువతకు ఉపాధి దూరమవుతోంది.
ఈ టిఒఎంసి విధానం గనుక పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ప్లాంట్‌లోని ఆపరేషన్స్ అన్నీ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఇది పరోక్షంగా విశాఖ ఉక్కు కర్మాగారం సంపూర్ణ ప్రైవేటీకరణకు మార్గాన్ని మరింత సుగుమం చేస్తుందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం, కార్మికుల హక్కులను పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

