Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విశాఖలో ఏఐజీ హాస్పిటల్‌ నిర్మాణానికి మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన

విశాఖలో ఏఐజీ హాస్పిటల్‌ నిర్మాణానికి మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన

వార్త 2 weeks ago

AIG Hospitals Vizag: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగంలో మరొక నూతన అధ్యాయం మొదలైంది. ఆసియాలోనే అత్యున్నత వైద్య సేవలకు ప్రసిద్ధి చెందిన ఏఐజీ (AIG) హాస్పిటల్స్ ఇకపై పారిశ్రామిక నగరమైన విశాఖపట్నంలో కొలువుదీరనుంది.

రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ అత్యాధునిక మెగా హాస్పిటల్ నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన చేశారు. విశాఖ ఆనందపురం మండలం ఎండాడ ప్రాంతంలో ఏఐజీ ఛైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి ఈ ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

భారీ పెట్టుబడితో 9,000 ఉపాధి అవకాశాలు

విశాఖలో రూపుదిద్దుకోనున్న ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం ఏఐజీ యాజమాన్యం వచ్చే ఐదేళ్లలో దశలవారీగా రూ. 2,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వెయ్యి పడకల సామర్థ్యంతో ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద వైద్య కేంద్రంగా మారుతుంది. దీనిద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 9,000 మందికి నూతన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తద్వారా ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి కూడా ఈ ఆసుపత్రి ఎంతగానో దోహదపడనుంది.

రెండు దశల్లో నిర్మాణం.. ప్రపంచ స్థాయి సేవలు

ఈ వైద్య కేంద్రాన్ని రెండు వేర్వేరు దశల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

  • మొదటి దశలో భాగంగా 650 పడకలతో 2028 అక్టోబర్ నాటికి సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నారు.
  • మిగిలిన 350 పడకల నిర్మాణాన్ని ఆ తర్వాత రెండేళ్లలో పూర్తి చేస్తారు. మొత్తం 9 ఎకరాల విస్తీర్ణంలో ఆసుపత్రి క్యాంపస్‌ను, మరో 2.5 ఎకరాల్లో ప్రత్యేక నర్సింగ్ కళాశాలను నిర్మించనున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ తరహాలోనే ఇక్కడ కూడా 8 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, 50కి పైగా వైద్య విభాగాలతో అత్యాధునిక వైద్యం అందించనున్నారు. కేవలం వైద్యమే కాకుండా శిక్షణ, పరిశోధనలకు కూడా ఇక్కడ పెద్దపీట వేయనున్నారు.

AIG Hospitals Vizag: ఘనంగా హాజరైన ప్రముఖులు

ఈ శంకుస్థాపన మహోత్సవానికి విచ్చేసిన మంత్రి నారా లోకేశ్‌కు ఏఐజీ యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. అనంతరం భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆసుపత్రి నిర్మాణ ప్రణాళికలు, భవిష్యత్ సేవలకు సంబంధించి రూపొందించిన ప్రత్యేక ఆడియో విజువల్ (ఏవీ)ను మంత్రి పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గణబాబు, ఏఐజీ వైస్ ఛైర్మన్ పీవీఎస్ రాజు, డైరెక్టర్ జీవీ రావు, సీఈవో సామ్ రిజ్వీ, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, పోలీస్ కమిషనర్ డా. శంఖభ్రత బాగ్చీ తదితరులు పాల్గొన్నారు.

ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టి కారు దహనం, డ్రైవర్ సజీవ దహనం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha