Viswanath and Sons Movie: గత కొంతకాలంగా యాక్షన్ సినిమాలకే పరిమితమైన హీరో సూర్య, ఈసారి వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే పక్కా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
కుటుంబ భావోద్వేగాలు, ఎంటర్‌టైన్‌మెంట్ మేళవించిన సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించిందో రివ్యూలో తెలుసుకుందాం.
Read Also : Agadha Movie Review: ఎం.ఎస్. రాజు 'అగధ' మూవీ రివ్యూ
Viswanath & Sons Movie Review
Viswanath and Sons Movie: కథ
సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఒక సంపన్న వ్యాపార కుటుంబానికి చెందిన వారసుడు. ఒకవైపు బిజినెస్ బాధ్యతలు చూసుకుంటూనే, మరోవైపు తల్లి (రాధికా శరత్‌కుమార్) కోరిక మేరకు రైఫిల్ షూటింగ్‌లో నైపుణ్యం సాధించి ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుస్తాడు. చిన్నప్పుడు తన కుటుంబంలో జరిగిన కొన్ని ఊహించని సంఘటనల కారణాల వల్ల 40 ఏళ్లు దాటినా సంజయ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు.
అయితే కుటుంబానికి వారసుడిని ఇవ్వాలని తల్లి కోరడంతో, ఒక డాక్టర్ సలహాతో సంజయ్ అమెరికా వెళ్లి సరోగసి ద్వారా ఒక బాబును ఇంటికి తీసుకొస్తాడు. కానీ, ఊహించని విధంగా ఆ బాబు తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. బిడ్డ కోలుకోవాలంటే కన్నతల్లి అవసరమని వైద్యులు చెప్పడంతో, బాబుకు జన్మనిచ్చిన తల్లి కోసం సంజయ్ అమెరికా పయనమవుతాడు. ఈ క్రమంలో ఆయన జీవితంలోకి మ్యాడీ (మమిత బైజు) ఎలా వచ్చింది? బిడ్డను కాపాడుకునేందుకు సంజయ్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? చివరికి తల్లి కోరిక మేరకు పెళ్లి చేసుకున్నాడా? అనేది మిగతా కథ.
కథన విశ్లేషణ
దర్శకుడు వెంకీ అట్లూరి కుటుంబ భావోద్వేగాలకు డీసెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించి, కుటుంబ సమేతంగా హాయిగా చూసి ఆస్వాదించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ప్రారంభమైన తొలి సన్నివేశం నుంచే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తూ చివరి వరకు మనసుకు హత్తుకునేలా సాగుతుంది.
సూర్యను ఒక స్టయిలిష్ రోల్‌లో చూసి చాలా రోజులైంది. ఆయన లుక్‌కు తగిన బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకుని, దానికి ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించిన విధానం ప్రశంసనీయం. హీరో-హీరోయిన్ల మధ్య ఉన్న ఏజ్ గ్యాప్, సరోగసి ఎమోషన్స్ మరియు హీరోయిన్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కథనంలో ఎక్కడా గ్రాఫ్ పడిపోకుండా వెంకీ అట్లూరి డీల్ చేశారు. "కోపం, ద్వేషం కూడా కొంతకాలం తర్వాత అలిసిపోతాయి" వంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. కొన్ని సన్నివేశాల్లో త్రివిక్రమ్ శైలి కనిపిస్తుంది. డ్రైవర్ ముత్తుస్వామి ఇంటర్వ్యూ సీన్, రవీనా టాండన్ క్యారెక్టర్ డ్రామా వంటి సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. మాస్ ఫ్యాన్స్ కోసం పెట్టిన యాక్షన్ సీన్స్ కూడా క్లాస్‌గా ఉంటాయి.
నటీనటుల పనితీరు
- సూర్య: సంజయ్‌గా ఎంతో స్టయిలిష్‌గా, కొత్త లుక్‌లో కనిపించారు. పాత్రకు ఆయన నటన వల్ల ఎంతో హుందాతనం వచ్చింది. ఎమోషనల్ సీన్స్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్.
- మమిత బైజు: ఈ సినిమాకు మమిత నటన మరొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఎనర్జిటిక్ ,న్యాచురల్ యాక్టింగ్‌తో ఆమె అలరించింది.
- ఇతర నటీనటులు: హీరో తల్లిగా రాధికా శరత్‌కుమార్, ఇతర పాత్రల్లో సునీల్ రెడ్డి, రవీనా టాండన్, నాజర్ తమ పరిధి మేరకు చక్కగా నటించారు.
సాంకేతిక విభాగం
జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) సినిమా ఎమోషనల్ కంటెంట్‌ను సరిగ్గా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా ప్లెజెంట్‌గా, కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా రిచ్‌గా ఉన్నాయి.
ముగింపు
ఒకవైపు చక్కటి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూనే, మరోవైపు హృదయాలను హత్తుకునే ఎమోషన్స్‌తో సాగే 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కుటుంబ సమేతంగా థియేటర్లలో చూడదగ్గ సరైన చిత్రం!

