Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూకేలో చరిత్ర సృష్టించిన తుషార్ కుమార్!

యూకేలో చరిత్ర సృష్టించిన తుషార్ కుమార్!

వార్త 6 days ago

UK Youngest Indian Mayor: యునైటెడ్ కింగ్‌డమ్ (UK) రాజకీయాల్లో భారత సంతతికి చెందిన యువకుడు అరుదైన రికార్డు సృష్టించారు. కేవలం 23 ఏళ్ల వయస్సులోనే బ్రిటన్‌లో మేయర్ పదవిని చేపట్టి, అత్యంత పిన్న వయస్కుడైన భారత సంతతి మేయర్‌గా తుషార్ కుమార్ చరిత్ర పుటల్లోకెక్కారు.

లండన్‌లోని ప్రముఖ కింగ్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ (రాజకీయ శాస్త్రం) పూర్తి చేసిన ఆయన, గత వారం బ్రిటన్‌లోని 'ఎల్‌స్ట్రీ అండ్ బోర్‌హామ్‌వుడ్' (Elstree and Borehamwood) నగర మేయర్‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

20 ఏళ్లకే కౌన్సిలర్‌గా ఎంట్రీ.. లేబర్ పార్టీలో ప్రస్థానం

చిన్నతనం నుంచే రాజకీయాలపై అమితమైన ఆసక్తి కలిగిన తుషార్ కుమార్ బ్రిటన్‌లోని ప్రముఖ ‘లేబర్ పార్టీ’ (Labour Party) ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తన ప్రతిభతో కేవలం 20 ఏళ్ల వయస్సులోనే, అంటే 2023లో కౌన్సిలర్‌గా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ఎల్‌స్ట్రీ అండ్ బోర్‌హామ్‌వుడ్ టౌన్ కౌన్సిల్‌లో డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ, నిబద్ధతను గుర్తించిన కౌన్సిల్.. ఇటీవల జరిగిన ప్రత్యేక సమావేశంలో ఏకగ్రీవంగా ఆయనను నగర మేయర్‌గా ఎన్నుకుంది.

UK Youngest Indian Mayor: అమ్మే స్ఫూర్తి.. చదువుతో పాటు రాజకీయం

 Tushar Kumar along with his mother Councilor Praveen Rani celebrating his historic election as the youngest Indian-origin mayor in the United Kingdom

యూకే చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సులో మేయర్ పీఠాన్ని అధిరోహించిన భారత సంతతి వ్యక్తిగా నిలిచిన తుషార్ కుమార్.. ఈ గౌరవం దక్కడంపై సామాజిక మాధ్యమాల (Social Media) వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఒకవైపు పూర్తిస్థాయి రాజకీయాల్లో చురుగ్గా రాణిస్తూనే, మరోవైపు తుషార్ తన ఉన్నత చదువులను కూడా కొనసాగిస్తుండటం విశేషం.

తుషార్ కుమార్ రాజకీయ ప్రవేశం వెనుక ఆయన కుటుంబ నేపథ్యం ఉంది. ఆయన తల్లి ప్రవీణ్ రాణి కూడా బ్రిటన్‌లో కౌన్సిలర్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఆమె సైతం డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. సమాజ సేవలో నిరంతరం శ్రమించే తన తల్లిని చూసి స్ఫూర్తి పొందే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఈ స్థాయికి చేరుకోవడానికి కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో ఉందని తుషార్ కుమార్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. బ్రిటన్ రాజకీయాల్లో భారత సంతతి యువత ఈ స్థాయిలో రాణించడంపై ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha