UPI 10 Years: భారతదేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలను పూర్తిగా మార్చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వ్యవస్థ పదేళ్లు పూర్తి చేసుకుంది.
ఈ చారిత్రక మైలురాయి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులు: సీఎం చంద్రబాబు
యూపీఐ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీ చేసిన సోషల్ మీడియా పోస్టుపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తన స్పందనను తెలియజేస్తూ, భారతదేశ ఆర్థిక లావాదేవీల రూపురేఖలను యూపీఐ సమూలంగా మార్చివేసిందని ప్రశంసించారు. తన వ్యక్తిగత అనుభవంతో చెబుతున్నానని, ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఇది విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని పేర్కొన్నారు.
UPI 10 Years: సామాన్యుడి నుంచి వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరికీ లబ్ధి
సమాజంలోని అన్ని వర్గాల వారికి యూపీఐ ఎంతో ఉపయోకరంగా మారిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వీధి వ్యాపారులు, చిన్న స్థాయి వ్యాపారులు, మహిళా పారిశ్రామికవేత్తలు మరియు విద్యార్థులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఇది ఒక భాగమైపోయిందని కొనియాడారు. రోజువారీ లావాదేవీలను ఇది అత్యంత సులభతరం చేసిందని ఆయన అన్నారు.
ప్రపంచానికి భారత్ సాంకేతిక సత్తా: ప్రధాని మోడీ పోస్ట్
అంతకుముందు, యూపీఐ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. భారత డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో యూపీఐ ఒక అత్యంత కీలకమైన మలుపు అని తెలిపారు. దీని విస్తృతి, సాధించిన ఘనత ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉందని, ప్రపంచ దేశాలకు మన సాంకేతిక సత్తా ఏంటో ఇది చాటిచెప్పిందని ప్రధాని పేర్కొన్నారు.

