Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యువకుడిని చంపేందుకు ప్లాన్.. నెల్లూరులో 10 మంది అరెస్ట్!

యువకుడిని చంపేందుకు ప్లాన్.. నెల్లూరులో 10 మంది అరెస్ట్!

వార్త 1 week ago

Nellore Crime News: పాత కక్షల నేపథ్యంలో ఒక యువకుడిని అంతమొందించాలనే ఉద్దేశంతో సమూహంగా ఏర్పడి, బీర్ బాటిళ్లతో తల, శరీరంపై విచక్షణారహితంగా దాడి చేసి హత్యాప్రయత్నానికి పాల్పడిన సంచలన కేసును నెల్లూరు జిల్లా పోలీసులు ఛేదించారు.

ఈ ఘోర దాడికి సంబంధించి ప్రధాన నిందితులతో పాటు మొత్తం 10 మందిని పోలీసులు రూరల్ పరిధిలో అరెస్ట్ చేశారు. ఈ అంతర్గత ముఠా దాడికి సంబంధించిన పూర్తి వివరాలను గురువారం నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోవూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) సుధాకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

Read also: AP NDA Meeting: ఏపీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల వేడుకలు.. చంద్రబాబు అధ్యక్షతన కీలక నేతల భేటీ!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు రూరల్ పరిధిలోని కుడితిపాలెం గ్రామానికి చెందిన షేక్. నాగూర్ బాబు అనే యువకుడు గత 2024లో ‘స్మైలీ’ అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, మనస్పర్థల కారణంగా ఆమె 2025లో ఆత్మహత్య చేసుకోగా, ఆ విషయమై నాగూర్ బాబుపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం అతను కోర్టు ద్వారా బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే, తన సోదరి మరణానికి నాగూర్ బాబే కారణమని భావించిన స్మైలీ సోదరులు మసూరి బన్నీ, మసూరి చక్రిలు అతనిపై తీవ్రమైన కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా నాగూర్ బాబును మట్టుబెట్టాలని సమయం కోసం వేచి చూశారు.

పెన్నా నది ఒడ్డున పొంచివుండి ఘోర దాడి..

ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీ రాత్రి నాగూర్ బాబు తన సోదరుడు షఫీతో కలిసి ఇందుకూరుపేట మండలం, ముదివర్తిపాలెం గ్రామంలో జరిగిన ఒక శుభకార్యానికి వెళ్లాడు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఇద్దరూ కలిసి తిరిగొస్తూ, మార్గమధ్యంలోని శివాలయం సమీపంలో ఉన్న పెన్నా నది ఒడ్డుకు వెళ్లారు. అక్కడ అప్పటికే పక్కా ప్లాన్‌తో పొంచివున్న నిందితులు, నాగూర్ బాబును హత్య చేయాలనే ఉద్దేశంతో ఒక్కసారిగా చుట్టుముట్టారు. నిందితులు తమ వెంట తెచ్చుకున్న బీర్ బాటిళ్లతో నాగూర్ బాబు తల, శరీరంపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

సహోదరుడిని కాపాడేందుకు అడ్డుకోబోయిన సోదరుడు షఫీపై కూడా ముఠా సభ్యులు దాడికి తెగబడ్డారు. దీంతో షఫీ ప్రాణభయంతో గట్టిగా కేకలు వేయడంతో, ఆ శబ్దాలు విన్న స్థానికులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పెన్నా నది వైపు రావడం గమనించిన నిందితులు వెంటనే తమ బైక్‌లపై అక్కడి నుండి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావమై స్పృహతప్పిన బాధితుడు నాగూర్ బాబును కుటుంబ సభ్యులు తక్షణమే నెల్లూరులోని నారాయణ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను అత్యవసర విభాగంలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.

Nellore Crime News: ట్విన్ సిస్టర్స్ బ్రదర్స్ గ్యాంగ్ అరెస్ట్..

బాధితుడి సోదరుడు షఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇందుకూరుపేట పోలీసులు హత్యాప్రయత్నం (Attempt to Murder) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజండ్ల కఠిన ఉత్తర్వుల మేరకు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో క్లూస్ టీమ్ మరియు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుల ఫోన్ లొకేషన్లను సేకరించారు. గురువారం మధ్యాహ్నం 3.00 గంటల సమయంలో నెల్లూరు రూరల్ మండలం, కొత్తూరు అంబాపురం టిడ్కో (TIDCO) గృహసముదాయాల సమీపంలో నిందితులు దాక్కున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు వ్యూహాత్మకంగా దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టయిన వారిలో మసూరి బన్నీ, మసూరి చక్రి, బండారు మహేష్ బాబు, పార్వతాల కార్తీక్, పాపకారి నాని, పోలేపల్లి జశ్వంత్, పచ్చిగళ్ల భాను, కొమ్మూరు వెంకట ద్వారక శైలేష్, జక్కల మణికంఠ మరియు షేక్ సలాం ఉన్నారు. నిందితుల వద్ద నుండి నేరానికి ఉపయోగించిన 3 మోటారు బైకులు, 10 ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే వారిపై, వ్యక్తిగత కక్షలతో హింసాత్మక మార్గాల్లో వివాదాలను పరిష్కరించుకోవాలని చూసే రౌడీ మూకలపై కఠిన చర్యలు ఉంటాయని, నెల్లూరులో లా అండ్ ఆర్డర్ తప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని సిటీ పోలీసులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇందుకూరుపేట సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) నవీన్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

రేపు విశాఖలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha