Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐపీఎల్‌లో భారీ ట్రేడ్.. ఢిల్లీకి పంత్, లఖ్‌నవూకు కుల్‌దీప్ యాదవ్

ఐపీఎల్‌లో భారీ ట్రేడ్.. ఢిల్లీకి పంత్, లఖ్‌నవూకు కుల్‌దీప్ యాదవ్

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌లో ఓ భారీ ట్రేడ్ డీల్ జరిగింది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తిరిగి తన పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) గూటికి చేరుకున్నాడు.

గత రెండు సీజన్ల క్రితం రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) పంత్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా ట్రేడ్ డీల్‌లో భాగంగా ఢిల్లీ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను లఖ్‌నవూకి ఇచ్చి, బదులుగా పంత్‌ను తమ జట్టులోకి తెచ్చుకుంది. ఐపీఎల్ అధికారిక ప్రకటన ప్రకారం.. పంత్ ఢిల్లీలో ఏడాదికి రూ. 15 కోట్ల వేతనం అందుకోనుండగా, కుల్‌దీప్ రూ. 13.50 కోట్ల కాంట్రాక్టుతో లఖ్‌నవూలో చేరాడు.

2025 సీజన్‌కు ముందు లఖ్‌నవూ సారథిగా బాధ్యతలు చేపట్టిన పంత్‌కు ఆ జట్టుతో రెండేళ్ల ప్రయాణం ఆశించినంతగా సాగలేదు. 2025లో 269 పరుగులు, 2026లో 312 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అలానే కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలం కావడంతో పాటు జట్టులో స్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్ లేకపోవడం అతని ప్రదర్శనపై ప్రభావం చూపింది. దీంతో ఇటీవలే లఖ్‌నవూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న పంత్, రూ. 12 కోట్ల భారీ వేతనం కోతకు సిద్ధపడి మరీ తన సొంత జట్టు ఢిల్లీ వైపు మొగ్గు చూపాడు. వాస్తవానికి 2016లో ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన పంత్, ఆ జట్టు తరఫున అత్యధికంగా 111 మ్యాచ్‌లు ఆడాడు. 43 మ్యాచ్‌లకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.

మరోవైపు చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఐదు సీజన్ల ఆడాడు. 2022 నుంచి ఢిల్లీ తరఫున 65 మ్యాచ్‌ల్లో 72 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. గతంలో ఢిల్లీలో రూ. 13.25 కోట్లు పొందిన కుల్‌దీప్ తాజాగా లఖ్‌నవూకు మారడం ద్వారా రూ. 13.50 కోట్లతో స్వల్ప లాభాన్ని పొందాడు.ఈ స్వాప్‌డీల్‌ గురించి రెండు జట్లు ఎక్స్ వేదికగా వెల్లడించాయి. అలానే ఈ ట్రేడ్ రాబోయే ఐపీఎల్ సీజన్లలో ఇరు జట్ల బలాబలాలను ఎలా మారుస్తుందో అని క్రికెట్ ప్రియులు ఆసక్తిగా చూస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy