Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్ తరఫున ఆడే ప్రతి నిమిషాన్నీ ఆస్వాదిస్తున్నా: విరాట్ కోహ్లీ

భారత్ తరఫున ఆడే ప్రతి నిమిషాన్నీ ఆస్వాదిస్తున్నా: విరాట్ కోహ్లీ

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తో మరోసారి అలరించాడు. ఒకే ఇన్నింగ్స్‌లో పలు రికార్డులను బద్దలు కొట్టాడు.

వన్డే ప్రపంచ కప్ 2027 లక్ష్యంగా సాగుతున్నానని ఇప్పటికే స్పష్టం చేసిన విరాట్.. తన ఆటతీరుపై మరోసారి స్పందించాడు. వెస్టిండీస్‌పై తిరుగులేని రికార్డు కొనసాగిస్తూ వస్తోన్న కోహ్లీ.. మరోసారి అజేయ శతకంతో చెలరేగాడు. మ్యాచ్ అనంతరం పలు ఆసక్తికర విషయాలపై విరాట్ మాట్లాడాడు.

'నా దృష్టి ఎప్పుడూ వ్యక్తిగత మైలురాళ్లపై ఉండదు. మ్యాచ్‌ పరిస్థితిని అర్థం చేసుకుని జట్టు కోసం చేయాల్సిన పని చేయడంపైనే నా ఫోకస్‌ ఉంటుంది. అలా ఆడుతున్నప్పుడు వ్యక్తిగత విజయాలు వాటంతట అవే వస్తాయి. ఇంతకాలం ఆడుతూ ఈ స్థాయిలో ఉండటం నాకు ఎంతో ఆనందంగా, అదృష్టంగా అనిపిస్తోంది. కష్టపడి పనిచేయడం, తలదించుకుని ముందుకు సాగడం, నాకు లభించిన అవకాశాలకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం.. ఇవే నేను చేస్తుంటాను. ఎంతోమంది ఇక్కడికి రావాలని కోరుకుంటారు. కానీ కొద్దిమందికే ఆ అవకాశం దక్కుతుంది. అందుకే ప్రతిరోజూ కష్టపడాలి' అని కోహ్లీ వెల్లడించాడు.

'ఇప్పుడు వచ్చే కుర్రవాళ్లకు నాదొక సలహా. ఫిట్‌గా ఉండేందుకు నిరంతరం శ్రమించాలి. మనం ఎంత గుర్తింపు, కీర్తి, అభిమానుల ప్రేమ సాధించినా.. మనం ఇంతకుముందు ఎక్కడి నుంచి ఈ స్థాయి వరకు వచ్చామనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. మూలాలను మర్చిపోవడం చాలా సులభం. కానీ మన ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో స్ఫూర్తివంతంగా అనిపిస్తుంది. నేను భారత్‌ తరఫున ఆడుతున్న ప్రతి నిమిషాన్నీ ఆస్వాదిస్తున్నా. అసలు నేను భారత్‌ తరఫున ఆడకపోయి ఉండే అవకాశం కూడా ఉంది. అందుకే లభిస్తున్న ప్రతి అవకాశాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నా' అని కోహ్లీ వివరించాడు.

ఆ లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది..

'ప్రపంచకప్‌కు ఇంకా ఏడాది సమయం ఉంది. నా లక్ష్యం ఏంటో నాకు స్పష్టంగా తెలుసు. అవకాశం వచ్చిన ప్రతి మ్యాచ్‌లో నా ఆటలోని వివిధ అంశాలపై పనిచేయాలి. ఫిట్‌గా ఉండాలి. చివరి 15 ఓవర్లలో బౌండరీ నుంచి బౌండరీకి పరుగెత్తగలగాలి. ఇన్నర్‌ రింగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ అదే తీవ్రతను చూపించాలి. ఇలా అన్ని అంశాల్లోనూ ముందుకు సాగితే ఈ ఫార్మాట్‌లో నాకు అవకాశాలు దక్కుతాయి. అందుకే ఒత్తిడికి గురి కాకుండా సంతోషంగా ఆడాలనుకుంటున్నా. నేను సానుకూలంగా ఆడతానని నాకు నేనే మాట ఇచ్చుకున్నా. అయితే నిర్లక్ష్యంగా మాత్రం కాదు. అనుభవజ్ఞుడైన ఆటగాడిగా ఆ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతను అర్థం చేసుకుని, జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లేలా ఆడాలి' అని కోహ్లీ స్పష్టం చేశాడు.

strong>

చెస్ ఒలింపియాడ్: భారత్ ఖాతాలో రెండు పతకాలు

ఆసియా క్రీడలు: లాంగ్ జంప్‌లో రజతం.. రన్నింగ్‌, డెకథ్లాన్‌లో కాంస్యాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy