Dailyhunt
ఎస్ఐఆర్ వర్సెస్ అల్లర్లు.. బెంగాల్‌లో వేడెక్కిన ఎన్నికల ప్రచారం

ఎస్ఐఆర్ వర్సెస్ అల్లర్లు.. బెంగాల్‌లో వేడెక్కిన ఎన్నికల ప్రచారం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ (West Bengal)లో ఎన్నికల వాతావరణం శనివారంనాడు ఒక్కసారిగా వేడెక్కింది. ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను ప్రధానాస్త్రంగా చేసుకుని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రచారం సాగించగా, శ్రీరామ నవమి ఊరేగింపులో అల్లర్లు, చొరబాటుదార్ల సమస్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ప్రచారం జరిపారు.

శ్రీరామ నవమి అల్లర్లకు బీజేపీనే కారణమని మమత విమర్శలు గుప్పించగా, దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ సజావుగా జరుగుతుంటే పశ్చిమబెంగాల్‌లోనే న్యాయ అధికారులను మోహరించాల్సి వచ్చిందని అమిత్‌షా తప్పుపట్టారు.

చొరబాటుదారులను దేశం నుంచి పంపేస్తాం

కోల్‌కతాలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో అమిత్‌షా మాట్లాడుతూ, రాష్ట్రంలో తిష్టవేసిన చొరబాటుదారులు బెంగాల్ భవిష్యత్తును నిర్ణయిస్తుంటే చూస్తూ ఊరుకుందామా? అని ప్రజలను ప్రశ్నించారు. ప్రతి ఒక్క చొరబాటుదారుని గుర్తించి ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికే పరిమితం కాకుండా దేశం నుంచి వెళ్లగొడతామని, ఇది బీజేపీ ఎజెండా అని స్పష్టం చేశారు. టీఎంసీ ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల సిలిగురి కారిడార్ భద్రతకు ప్రమాదం ఉందని అన్నారు. ఒకరకంగా దేశ భద్రత బెంగాల్ ఎన్నికలతో ముడిపడి ఉందని, చొరబాటుదారులు ప్రవేశిస్తున్న ఏకైక రాష్ట్రంగా పశ్చిమబెంగాల్ నిలుస్తోందని ఆరోపించారు.

రాజకీయ భాదితురాలి కార్డు చూపించి..

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాజకీయ బాధితురాలి కార్డు చూపించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తుంటారని మమతా బెనర్జీని అమిత్‌షా విమర్శించారు. ఒకసారి కాలు విరిగిందని, మరోసారి హెడ్ బ్యాండేజీతో, కొన్నిసార్లు అనారోగ్యం సాకుగా చూపిస్తుంటారని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారని అన్నారు.

నా అధికారాలు ఊడలాక్కుకున్నారు: మమత

కాగా, రాణిగంజ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో బీజేపీపై మమతాబెనర్జీ నిప్పులు చెరిగాయి. ముర్షీదాబాద్ జిల్లాలోని రఘునాథ్‌గఢ్‌లో జరిగిన హింసకు బీజేపీనే కారణమని ఆరోపించారు. ఇందులో తన బాధ్యత ఏమీలేదని, తన అధికారాలన్నీ ఊడలాక్కున్నారని వాపోయారు. 'ఆఫీసర్లందరినీ బదిలీ చేశారు. బీజేపీ మనుషులను ఇక్కడకు పంపారు. వాళ్లకు మనం గెలుస్తామని తెలియదు. రఘునాథ్‌గంజ్‌లో అల్లర్లను రెచ్చగొట్టారు. అందుకు వాళ్లు సిగ్గుపడాలి. అధికారులందరినీ ఇక్కడ్నించి పంపేసి అల్లర్లకు పాల్పడ్డారు. దుకాణాలు ధ్వసం చేశారు. వేరేవాళ్ల ఇళ్లను ధ్వంసం చేసే హక్కు మీకెవరిచ్చారు? వీటన్నంటికికీ మీరే జవాబుదారీ వహించాలి' అని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బుల్డోజర్లు నడిపించి ప్రతి ఒక్కరిని గెంటేస్తారని, ఎస్ఐఆర్ ప్రక్రియ బీజేపీకి మరణశాసనం కానుందని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy