Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫిఫా ప్రపంచ కప్: రిటైర్‌మెంట్ ప్రకటించనున్న రొనాల్డో?

ఫిఫా ప్రపంచ కప్: రిటైర్‌మెంట్ ప్రకటించనున్న రొనాల్డో?

ఇంటర్నెట్ డెస్క్: పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో కెరీర్‌పై కొంతకాలంగా ఊహాగానాలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఫిఫా ప్రపంచ కప్ 2026లోనూ అతడి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అభిమానులు ఇక ఆటకు వీడ్కోలు పలికే సమయం వచ్చిందంటూ విమర్శలు చేశారు.

తాజాగా క్రొయేషియాతో జరిగిన రౌండ్ ఆఫ్ 32లో పోర్చుగల్ విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ఈ క్రమంలో రొనాల్డో సోదరి కాటియా అవీరో.. అతడి కెరీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

'నాకు తెలిసిన సమాచారం ప్రకారం.. ప్రపంచ కప్ టోర్నీల్లో పోర్చుగల్ జెర్సీలో రొనాల్డో మళ్లీ కనిపించకపోవచ్చు. ఇదే అతడి చివరి ప్రయాణం. ఈ క్షణాలను ఆస్వాదించండి. అతడి లాంటి ప్లేయర్ మళ్లీ రావడం చాలా కష్టం' అని కాటియా తెలిపారు. రొనాల్డో వెయ్యి గోల్స్ పూర్తి చేసిన తర్వాతే రిటైర్‌మెంట్ ప్రకటిస్తారా? అనే ప్రశ్నకు కూడా కాటియా సమాధానం ఇచ్చారు. 'నేను జాతీయ జట్టు గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ప్రపంచ కప్ తర్వాత పోర్చుగల్ తరఫున అతడి ప్రయాణం ముగిసే అవకాశాలే ఎక్కువ' అని స్పష్టం చేశారు.

చరిత్ర సృష్టించిన రొనాల్డో...

రౌండ్ ఆఫ్ 32లో క్రొయేషియాతో జరిగిన ఉత్కంఠ పోరులో పోర్చుగల్ 2-1 తేడాతో విజయం సాధించింది. దీంతో రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. రొనాల్డో పెనాల్టీ ద్వారా తొలి గోల్ చేయగా.. అదనపు సమయంలో గోన్సాలో రామోస్ మరో గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. 41 ఏళ్ల రొనాల్డో పోర్చుగల్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగానే కాకుండా, అత్యధిక గోల్స్ చేసిన రికార్డును కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు. పోర్చుగల్ ప్రీక్వార్టర్ మ్యాచ్‌లో స్పెయిన్‌తో తలపడనుంది. ఈ ప్రపంచ కప్ నిజంగానే రొనాల్డోకు చివరి అంతర్జాతీయ టోర్నమెంట్ అవుతుందా? అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy