Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హెగ్సెత్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా?

హెగ్సెత్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా?

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా తదుపరి అధ్యక్షుడిగా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ పేరు తెరపైకి వస్తున్న వేళ డొనాల్డ్ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2028 ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో పోటీచేసే అవకాశాలపై మాట్లాడిన అగ్రరాజ్య అధ్యక్షుడు.. ఆ విషయమై ఇప్పుడే చర్చ అక్కర్లేదని సమాధానాన్ని దాటవేశారు. 'హెగ్సెత్‌ అద్భుతంగా పనిచేస్తున్నారు. అయితే ఇలాంటి విషయాల గురించి మాట్లాడేందుకు ఇది తొందరపాటు చర్య అవుతుంది. ముందుగా నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికలను పూర్తి చేయాలి' అని ట్రంప్‌ అన్నారు.

యూఎస్ ప్రెసిడెంట్‌గా రెండు పర్యాయాలు మాత్రమే కొనసాగే అవకాశమున్న ట్రంప్‌.. 2029లో ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. దీంతో ఆయన 'మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌' ఉద్యమాన్ని ముందుకు నడిపించే తదుపరి నేత ఎవరన్న దానిపై రిపబ్లికన్‌ పార్టీలో చర్చ జోరందుకుంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్లు ఇప్పటికే వినిపిస్తున్నా.. తాజాగా ఆ లిస్ట్‌లో హెగ్సెత్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల ఐయోవా స్టేట్‌ ఫెయిర్‌లో రిపబ్లికన్ల తరఫున హెగ్సెత్ ప్రచారం చేయడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చినట్టైంది. అయితే ఈ వార్తలను హెగ్సెత్‌ ఖండించారు. అవి '100 శాతం అవాస్తవం' అని సోషల్‌ మీడియాలో పేర్కొన్నారాయన.

హెగ్సెత్‌ గతంలో ఆర్మీ నేషనల్‌ గార్డ్‌లో పనిచేశారు. అనంతరం ఫాక్స్‌ న్యూస్‌ ఛానల్‌లో టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ట్రంప్‌ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయన రాజకీయ భవితవ్యంపై ట్రంప్‌ మరింత ఆసక్తికరంగా స్పందించారు. 'ప్రస్తుతం ఆయనకు సైన్యం, సైనికుల సంక్షేమం తప్ప మరేదీ ముఖ్యం కాదు' అని వ్యాఖ్యానించారు. మరోవైపు 2028 అధ్యక్ష ఎన్నికల కోసం పలువురు నేతలు ఇప్పటికే అంతర్గతంగా సన్నాహాలు ప్రారంభించి ఉండొచ్చని ట్రంప్‌ చెప్పారు. ఏది ఏమైనా ట్రంప్‌ వారసుడిగా అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించనప్పటికీ.. జేడీ వాన్స్‌, మార్కో రూబియో, హెగ్సెత్‌ వంటి పేర్లు వినిపిస్తుండటం రిపబ్లికన్‌ పార్టీలో 2028 పోరుపై ఆసక్తి రేపుతోంది.

ఇవీ చదవండి:

అమెరికాలో దారుణం.. ఇద్దరు భారతీయ మహిళలను హత్య చేసిన స్నేహితురాలు..

పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత!!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy