Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జమ్మూకశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్ నబీ  భారత టెస్ట్ జట్టుకు ఎంపికలో ట్విస్ట్!

జమ్మూకశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్ నబీ భారత టెస్ట్ జట్టుకు ఎంపికలో ట్విస్ట్!

స్పోర్ట్స్ డెస్క్: రంజీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీకి మరోసారి ఘోర అవమానం ఎదురైంది. సొంతగడ్డపై అఫ్గానిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు ఈ స్టార్ పేసర్‌ను నెట్ బౌలర్‌గా ఎంపిక చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీలో ఆకిబ్ నబీ 12.57 సగటుతో 60 వికెట్లు పడగొట్టి జమ్మూ కశ్మీర్‌కు టైటిల్ అందించినప్పటికీ బీసీసీఐ సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు.

అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టుకు తొలుత ఆకిబ్ నబీని ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో పంజాబ్‌కు చెందిన గుర్నూర్ బ్రార్‌కు అనూహ్యంగా అవకాశం కల్పించింది అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. రంజీ క్రికెట్‌లో ఇన్ని వికెట్లు తీసినా.. అవకాశం ఇవ్వనప్పుడు ఆ టోర్నీని మూసేయాలంటూ మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో కాస్త వెనక్కి తగ్గిన సెలెక్టర్లు.. ఆకిబ్ నబీకి నెట్‌బౌలర్‌గా అవకాశం ఇచ్చారు.

ఈ నిర్ణయాన్ని కూడా నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇది కంటి తుడుపు చర్య తప్ప, అతని ప్రతిభకు తగిన గుర్తింపు కాదని మండిపడుతున్నారు. మొత్తంగా 41 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన నబీ 156 వికెట్లు పడగొట్టాడు. రంజీ2025-26లో జమ్మూ కాశ్మీర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఒక ఆటగాడిని ప్రధాన జట్టులోకి తీసుకోకుండా కేవలం నెట్ ప్రాక్టీస్‌కు పరిమితం చేయడం అతని కృషిని అవమానించడమేనని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 6న ప్రారంభమయ్యే ఈ టెస్ట్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు బరిలోకి దిగనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy