ఐర్లాండ్, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ నుంచి తరలివచ్చిన ప్రవాసాంధ్రులు
చంద్రబాబు నాయకత్వం, లోకేష్ చొరవతో రాష్ట్రం 20 ఏళ్లు ముందుకెళ్లిందన్న నేతలు
జర్మనీలో మినీ మహానాడు ఘనంగా జరిగింది. జర్మనీ నుంచే కాక ఐర్లాండ్, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ నుంచి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, గళ్లా రామచంద్ర రావు పాల్గొన్నారు.
Nri-TDP జర్మనీ విభాగానికి సంబంధించి వెబ్ సైట్‌ను ఎమ్మెల్యే మాధవి ఆవిష్కరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్ల కేటాయించాలని తెదేపా అధిష్టానం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని వక్తలు కొనియాడారు. అవినీతి, అరాచకం, విధ్వంసంతో ఏపీలో సాగిన జగన్ పాలనకు ప్రజలు ఓటు అనే ఆయుధంతో పోటుపొడిచారని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని స్పష్టం చేశారు. సుపరిపాలన ప్రారంభమై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

జ్యోతి ప్రజ్వలన, మా తెలుగు తల్లికి గీతాలాపనలతో కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు. జై టీడీపీ.. ఎన్టీఆర్ అమర్ రహే...జై చంద్రబాబు... జై లోకేష్.. నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ ఎల్లలు దాటినా.. మాతృభూమిని, తెలుగుదేశం పార్టీని ప్రవాసాలు గుర్తుపెట్టుకోవడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. జర్మనీలో మహానాడు నిర్వహించడ పై హర్షం వ్యక్తం చేశారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కుమారుడిగా జన్మించటం తన అదృష్టమని తెలిపారు. కుటుంబం కంటే ప్రజలకే ఎన్టీఆర్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వారిని పేర్కొన్నారు. 'తెలుగు నేలపై చెరగని చిరునామా ఎన్టీఆర్. సినిమాల్లో నటించినా, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చినా ఏది చేసినా ప్రజా హితం... సంచలనమే. సంక్షేమ రాజ్యాన్ని స్థాపించి, సామాజిక న్యాయాన్ని చిత్తశుద్ధితో అమలుచేసిన ఘనత మా నాన్నగారు, తెలుగువారి అన్నగారు ఎన్టీఆర్‌కే దక్కుతుంది' అని రామకృష్ణ తెలిపారు.

పాలనలో విప్లవాత్మక మార్పులు తెదేపాతోనే
కూటమి ప్రభుత్వ 24 నెలల పాలనలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి పథంలో 20 ఏళ్ల ముందుకు సాగిందని మన్నవ సుబ్బారావు అన్నారు. జూన్ రెండో తేదీ నిరంకుశత్వానికి చరమగీతం పాడి, ప్రజాస్వామ్యనికి కొత్త అర్థం చెప్పిన రోజని అని వ్యాఖ్యానించారు. గళ్లా రామచంద్ర రావు మాట్లాడుతూ 'ప్రవాసాంధ్రులు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టాలి. అమరావతి అభివృద్ధిలో పాలు పంచుకోవాలి' అని పిలుపునిచ్చారు.

46 రకాల ఆంధ్ర వంటకాలతో కమ్మని విందు
మిని మహానాడులో 46 రకాల ఆంధ్ర వంటకాలతో అతిథులకు కమ్మని విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమానికి రామ్ బొల్లా తన సహాయ సహకారాలు అందజేశారు. మహానాడు కో-ఆర్డినేటర్ వంశీ దాసరి, ఎన్నారై తెదేపా నాయకులు వెంకట్ ఖండ్ర, శ్రీకాంత్ కుడితిపూడి, పవన్ కుర్ర, సుమంత్ కొర్రపాటి, నరేష్ కోనేరు,శివ బత్తల, టిట్టు మద్దిబట్ల , కిషోర్ చలసాని, రావి అమర్ నాథ్ సహా పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.




ఈ వార్తలనూ చదవండి:
పదవి నుంచి వైదొలగనున్నట్టు ప్రకటించిన వైట్ హౌస్ ఏఐ సలహాదారు శ్రీరామ్ కృష్ణన్
ఇరాన్ యుద్ధంతో నష్టపోయిన విద్యార్థులకులకు న్యాయం చేయాలి: ఎన్నారై టీడీపీ నేతలు

